టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా రాజ్యసభ సభ్యుడు కే కేశవరావును నియమిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్నారు. లోక్ సభలో టీఆర్ఎస్ పక్ష నేతగా జితేందర్ రెడ్డిని, ఉపనేతగా వినోద్ కుమార్ ను, పార్లమెంటులో టీఆర్ఎస్ పార్టీ విప్ గా కడియం శ్రీహరిని నియమించారు.
ఈ సందర్భంగా మహబూబ్ నగర్ ఎంపీ, లోక్ సభ పక్ష నేత జితేందర్ రెడ్డి మాట్లాడుతూ, ‘కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంగా ఉండబోదని, చంద్రబాబుకు ధీటుగా లాబీయింగ్ చేసి భారీ ఎత్తున నిధులు తెచ్చే బాధ్యతను తాను తీసుకుంటానని’ చెప్పారు. అంతేకాకుండా బీజేపీలో ఉన్న సమయంలో ఎంపీలుగా ఉన్న వారంతా నేడు కేంద్రమంత్రులయ్యారని, వారి సహకారంతో తెలంగాణకు నిధులు తీసుకొస్తామని పేర్కొన్నారు. సదానంద గౌడ రైల్వే శాఖ మంత్రిగా ఉన్నారని, కర్ణాటకకు కొత్త లైన్లు కావాలంటే తెలంగాణ మీదినుంచే వేయాల్సి వస్తుందని, అలా చేయడంవల్ల తెలంగాణ రాష్ట్రానికి కలిసివస్తుందని వివరించారు.
పోలవరం ప్రాజెక్టుపై ఆర్డినెన్స్ తేవడమంటే పిచ్చుకపై బ్రహ్మాస్త్రమని, ఈ విషయంపై పార్లమెంటులో తీవ్రస్థాయిలో పోరాడుతామని జితేందర్ రెడ్డి చెప్పారు. తనను లోక్ సభ పక్ష నేతగా నియమించి సీఎం కేసీఆర్ అతిపెద్ద బాధ్యతను అప్పగించారని, అధినేత ఆశయాన్ని నెరవేరుస్తానని, త్వరలోనే మోడీని రాష్ట్రానికి ఆహ్వానిస్తామని జితేందర్ రెడ్డి అన్నారు.