mt_logo

జల తపస్వి

By: కట్టా శేఖర్‌రెడ్డి..
కాళేశ్వరం అయితదా.. ఎట్లయితది? యానించయితది? నీళ్లు ఎదురెక్కుతయా? ఇన్ని బరాజులు, పంపుహౌసులు, రిజర్వాయర్లు, ఇన్ని సొరంగాలు, వందల కిలోమీటర్ల కాలువలు, ఇంత కరంటు ఎలా సాధ్యం? సందేహాలు, సమస్యలు, ప్రశ్నలు ముందుపెట్టి, కేసులు, కయ్యాలు పుట్టించిన రాజకీయ నాయకులు, ఇంజినీర్లు, మేధావులు వేసిన పిల్లి మొగ్గలు ఇంకా మర్వలేదు. ఈ పిల్లి మొగ్గలన్నింటికీ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభమే సమాధానం చెప్పింది. మన గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సమక్షంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ పాలిట మరో ఆధునిక దేవాలయం. స్వరాష్ట్ర చరిత్రలో ఒక మహోజ్వల ఘట్టం. ఎన్నో యేండ్లుగా నోళ్లు తెరిచిన తెలంగాణ బీళ్లకు కాళేశ్వరం ఒక జలహారం.

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మూడేండ్లలో మూడు బరాజులు, 19 రిజర్వాయర్లు, 19 పంపుహౌసులు, 203 కిలోమీటర్ల మేర సొరంగాలు, 1531 కిలోమీటర్ల మేర గ్రావిటీ కాలువలు, 1832 కిలోమీటర్ల మేర సాగునీటి సరఫరా వ్యవస్థ, 17 విద్యుత్ సబ్‌స్టేషన్లు, రెండు వందల టీఎంసీల నీటిని తెలంగాణకు మళ్లించగల నిర్మాణాలను పూర్తిచేసి ఒక కొత్త చరిత్ర సృష్టించారు. దేశంలోనే మరెక్కడా లేని విధంగా భూగర్భంలో మహాసౌధాలను, అతి పెద్ద మోటర్లను స్థాపించి గోదావరి నీటిని వందల మీటర్ల పైకి ఎత్తిపోసే మహా యజ్ఞాన్ని మన ఇంజినీర్లు పూర్తిచేశారు.

ఒక ముఖ్యమంత్రి అర్ధరాత్రి కల పడ్డట్టు లేచి తన ఆఫీసు కంప్యూటరులో భూగోళాన్ని తెరిచి తెలంగాణ ఎత్తుపల్లాలు, నదీ ప్రవాహగతులు, నీటి లభ్యతలు, నీటి వాలులు, సొరంగాలు, కాలువలు, రిజర్వాయర్ల అవసరాలన్నింటినీ లెక్కలు వేసుకుని, ప్రాజెక్టులకు కొత్తరూపునివ్వడం ఇంకా పాత మరుపు కాలేదు. ఈ మూడున్నరేండ్లూ ఆయన ఆలోచన, ఆరాటం, ఆశయం, సమయమంతా ప్రాజెక్టుల కోసమే వెచ్చించారు. ప్రాజెక్టుల వెంట ఆయన పరుగెత్తారు. అందరినీ పరుగెత్తించారు. రాత్రీపగలూ భేదంలేకుండా పని చేయించారు. ఇంజినీర్లలో ఇంజినీరులాగా,అధికారుల్లో అధికారిలా, రైతుల్లో రైతులా, పేదల్లో పేదలాగా ఆలోచించడం, అందరినీ ఒక్కబిగిన పనిలో నిమగ్నం చేయడం కేసీఆర్‌కే సాధ్యమైంది. కాలం కలిసి వచ్చి, గోదావరి గంగ పరవళ్లు తొక్కి, రెండు వందల టీఎంసీల నీరు మన రిజర్వాయర్లకు, మన కాలువలకు, మన చెరువులకు ప్రవహిస్తే సతతహరిత తెలంగాణ ఆవిష్కృతమవుతుంది. ఆధునిక తెలంగాణ నిర్మాతగా కేసీఆర్ పేరు అజరామరంగా నిలిచిపోతుంది.

Source: నమస్తే తెలంగాణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *