పొన్నాల లక్ష్మయ్యతో ఉన్న విభేదాలతోనే కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టీ హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో కరెంటు కష్టాలున్నాయని, దానికి గతంలో సీఎంగా పనిచేసిన వైఎస్ కారణమని, రాయలసీమ థర్మల్ ప్లాంట్, విజయవాడలో వీటీపీఎస్ ఏర్పాటు చేశారని, తెలంగాణలో నేదునూరు ప్లాంట్ కు గ్యాస్ కేటాయింపులు, బీపీఎల్ థర్మల్ ప్లాంటుకు బొగ్గును కేటాయించలేదని విమర్శించారు.
మంగళవారం తెలంగాణ భవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో హరీష్ రావు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. సీఎం కేసీఆర్ చేస్తున్న మంచిపనులను చూసి ప్రజలు ఎక్కడ తమను మర్చిపోతారో అన్న బాధతోనే ప్రతిపక్షాలు అర్థంపర్థం లేని విమర్శలకు దిగుతున్నారని, అక్రమ కట్టడాల తొలగింపును ప్రోత్సహించాల్సింది పోయి కూల్చివేతలకు అడ్డుపడతామని చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తుందని, బాధ్యత కలిగిన వారు మాట్లాడే మాటలేనా? అని పీసీసీ అధ్యక్షుడు పొన్నాలను హరీష్ రావు ప్రశ్నించారు.
కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని మానిఫెస్టోలో టీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిందని, మానిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తామని, ఎన్నో ఖాళీలు ఉన్నాయని, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హరీష్ రావు స్పష్టం చేశారు. రుణమాఫీపై జానారెడ్డికే స్పష్టం లేదని, తెలంగాణలో రైతు కష్టాల్లో ఉన్నాడని గుర్తించి 18వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేస్తామని చెప్పామని అన్నారు.
సీఎం కేసీఆర్ ఏం చేస్తున్నారో బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి తెలియకపోయినా ప్రజలకు తెలుసని, బీజేపీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం తెలంగాణకు ఏం చేసిందో చెప్పాలని, కేంద్ర బడ్జెట్ లో, రైల్వే బడ్జెట్ లో కేంద్రం తెలంగాణకు మొండి చెయ్యి చూపిందని విమర్శించారు. రాష్ట్రం ఇంతగా కరెంటు కష్టాలు పడుతుంటే 450మెగావాట్ల లోయర్ సీలేరు ప్రాజెక్టును కేంద్రం ఏపీ ప్రభుత్వానికి కట్టబెట్టిందని, రాష్ట్ర విద్యుత్ వాటాలో తాజాగా 1.2శాతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు.
హైదరాబాద్ లో గవర్నర్ పాలన తెస్తామంటే నోరు విప్పారని, సానియా మీర్జాను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా నియమిస్తే బీజేపీ కేంద్ర నాయకత్వం సమర్ధిస్తుంటే ఇక్కడ మాత్రం విమర్శిస్తూనే ఉన్నారని, గతంలో మీ ప్రభుత్వమే గర్ల్ చైల్డ్ ప్రమోటర్ గా సానియాను ఉపయోగించుకోలేదా? అని కిషన్ రెడ్డిని నిలదీశారు. ప్రభుత్వం ప్రజలు, ప్రతిపక్షపార్టీల భాగస్వామ్యంతో తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దాలనుకుంటున్నదని, మంచి నిర్ణయాలు కలిసి తీసుకుందామని హరీష్ రావు ప్రతిపక్షాలకు సూచించారు. ఈ సమావేశంలో ఎంపీ కడియం శ్రీహరి, కర్నే ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.