నిజామాబాద్ ఎంపీ స్థానానికి టీఆర్ఎస్ పార్టీ తరపున కల్వకుంట్ల కవిత నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా కవిత నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అంతకుముందు నిజామాబాద్ శివారులోని సారంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఎంపీ కవిత, ఆమె భర్త అనిల్ కుమార్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తన కుటుంబ సభ్యులను కలిసి ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు.
నామినేషన్ దాఖలు చేసిన అనంతరం కవిత మీడియాతో మాట్లాడుతూ మరోసారి పార్లమెంట్ కు వెళ్ళడానికి అవకాశం ఇస్తే సేవ చేసేందుకు ముందు ఉంటానని అన్నారు. దేశంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఈ సమయంలో రాష్ట్రంలో 16 మంది టీఆర్ఎస్ ఎంపీలను గెలిపిస్తే తెలంగాణ రాష్ట్ర హక్కులను సాధించుకునే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు. తెలంగాణకు రావాల్సిన నిధుల కోసం ఈ ఐదేండ్ల కాలంలో టీఆర్ఎస్ ఎంపీలందరూ ముందుండి కొట్లాడారని కవిత చెప్పారు.