డిల్లీలో జరిగిన నిఘా అధికారుల సమావేశంలో రాష్ట్రపతి మాట్లాడుతూ ‘ప్రజలందరినీ కలిపి ఒక చోట ఉంచడం సాధ్యం కాదని, దేశ ఐక్యత, సమగ్రత, 120 కోట్ల మందిని కలిపి ఉంచడం సమస్యలుగా ఉన్నాయ’ని అన్నారు. కొత్త రాష్ట్రాల ఏర్పాటు, డిమాండ్లను రాజకీయంగా, పరిపాలనాపరంగా, మేధోపరంగా పరిష్కరించాలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి గురువారం హైదరాబాద్ నగరానికి చేరుకున్నారు. నెలాఖరు వరకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రంలో బస చేయనున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రత్యేక విమానం ‘రాజ్ కమల్’ లో గురువారం సాయంత్రం హకీంపేట్ విమానాశ్రయానికి వచ్చారు. గవర్నర్ నరసింహన్, సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, హైదరాబాద్ మేయర్ మాజిద్ హుస్సేన్, మండలి చైర్మన్ చక్రపాణి, రాష్ట్ర మంత్రులు జే. గీతారెడ్డి, పితాని సత్యనారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి, డీజీపీ ప్రసాదరావు మొదలగువారు ఘనస్వాగతం పలికారు. ప్రతిసారిలాగే రాష్ట్రపతి ఈ నెల 19 నుండి 31 వరకు బొల్లారంలోని రాష్ట్రపతి భవన్లో బస చేసి అక్కడినుండే అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ నెల 23న అనంతపురం జిల్లాలో జరిగే మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి శత జయంతి ముగింపు సభకు రాష్ట్రపతి హాజరవుతారు. తర్వాత ఆగ్రా, ముంబై ప్రాంతాల్లో పర్యటించి 31 న తిరిగి డిల్లీకి పయనమవుతారు.