వరంగల్ జిల్లాలో త్వరలో ప్రారంభం కాబోయే కాళోజీ నారాయణరావు హెల్త్ వర్సిటీ కోసం కాకతీయ విశ్వవిద్యాలయంలోని హాస్టల్ గదులను తాత్కాలికంగా ఉపయోగించుకోవాలని భావిస్తున్నట్లు ఉపముఖ్యమంత్రి టీ రాజయ్య పేర్కొన్నారు. యూనివర్సిటీ ఇన్చార్జిగా సురేశ్ చందా శనివారం బాధ్యతలు స్వీకరిస్తారని రాజయ్య తెలిపారు. శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి వరంగల్ లో ఆరోగ్యవర్సిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపిన తర్వాత రాజయ్య మీడియాతో మాట్లాడారు.
వరంగల్ ను హైదరాబాద్ తరహాలో అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని, కేసీఆర్ ద్వారానే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందన్నారు. వరంగల్ సెంట్రల్ జైలును మమ్ముకూరుకు తరలించి ఆ స్థలంలో హెల్త్ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈనెల 30 లోపు తెలంగాణ యూనివర్సిటీని ఏర్పాటు చేయకుంటే ఈ విద్యాసంవత్సరం తెలంగాణ విద్యార్థులకు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుతోనే సర్టిఫికెట్లు వచ్చేవని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. యూనివర్సిటీ పరిధిలో 23 కోట్ల రూపాయలతో అత్యవసర సేవల దవాఖాన, రూ. 130 కోట్లతో సూపర్ స్పెషాలిటీ దవాఖానను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.
కేసీఆర్ తనకు తండ్రి లాంటి వారని, ఆరోగ్యవర్సిటీని వరంగల్ లో ఏర్పాటు చేయడం పట్ల జిల్లా ప్రజలందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. సీఎం ను కలిసిన వారిలో మంత్రి జగదీష్ రెడ్డి, ఎంపీ కేశవరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ తదితరులు ఉన్నారు. ఇదిలాఉండగా వైద్యవిద్యకు సంబంధించిన కార్యకలాపాలన్నీ ఇకపై కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ పేరుతోనే నిర్వహించనున్నట్లు ప్రభుత్వం శుక్రవారం జీవో జారీ చేసింది. వచ్చే సంవత్సరం నుండి ఈ యూనివర్సిటీ పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభిస్తుంది.
