మెదక్ లోక్ సభ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా నంగునూరు మండలం కొండరాజ్ పల్లి, ఖాత గ్రామాల్లో హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడితెల సతీష్ తో కలిసి ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్ ప్రచారం నిర్వహించారు. వీరి ప్రచారానికి ఆయా గ్రామాల మహిళలు మంగళహారతులు, డప్పులతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఈటెల కాంగ్రెస్ నేత పొన్నాలపై తీవ్రంగా మండిపడ్డారు.
‘కడుపు మాడ్చుకున్నం.. ఎండుకారం తిన్నం.. ఎండ, చలి, వాన లెక్కచేయకుండా ఉద్యమాలు చేసినం. జైళ్లకు వెళ్ళినం, రోడ్ల మీద, రైల్వే పట్టాలమీద పన్నం.. పదవులను గడ్డిపోచలా వదిలేసినం. రాజీనామా చేసిన ప్రతీసారీ తెలంగాణ గడ్డ మమ్మల్ని అక్కున చేర్చుకుంది. మేం రాజీనామా చేసినప్పుడు నీవెక్కడున్నావ్ మిస్టర్ పొన్నాలా? కేసీఆర్ 14 ఏండ్ల కిందట రాజీనామా చేయకపోతే తెలంగాణ వచ్చేదా? అని ప్రశ్నించారు.
కరీంనగర్ జిల్లాలో 14 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని గతంలో పొన్నాల అబద్దాలు చెప్పారని, అలాంటి వ్యక్తులు ఈరోజు అవాకులు, చెవాకులు మాట్లాడుతున్నారని అన్నారు. తెలంగాణలో ఆకలి కేకలు లేని పచ్చని తెలంగాణను నిర్మించడమే మాముందున్న కర్తవ్యమని, కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నట్లుగా ఏ ఒక్క పేద కుటుంబం రేషన్ కార్డు తొలగించమని, పౌరసరఫరాల శాఖ మంత్రిగా నేను చెప్తున్నా అని ప్రజలకు ఈటెల స్పష్టం చేశారు.