mt_logo

కబ్జాదారుల వెన్నులో వణుకు పుట్టాలి – హరీష్ రావు

హైదరాబాద్ నగరానికి చెందిన మణికొండలోని వక్ఫ్ భూములను నిబంధనలకు వ్యతిరేకంగా ల్యాంకో హిల్స్ కు కేటాయించడంపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తామని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి టీ హరీష్ రావు హెచ్చరించారు. వక్ఫ్ భూములను ఇతరులకు విక్రయించడం చట్ట విరుద్ధమని, ఆ భూములు ల్యాంకో సంస్థకు ఇవ్వొద్దని రాష్ట్ర హైకోర్టు గతంలో ప్రభుత్వాన్ని ఆదేశించినా అక్రమంగా దోచిపెట్టారని, ప్రభుత్వమే దళారీగా మారి అవి వక్ఫ్ భూములు కావంటూ సుప్రీంకోర్టులో కేసు వేయడం దారుణమని మండిపడ్డారు.

శుక్రవారం మెదక్ జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని కలెక్టరేట్ లో వక్ఫ్ భూములపై హరీష్ రావు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి, జిల్లా ఇన్చార్జి కలెక్టర్ శరత్ తో పాటు 46 మండలాల తహసీల్దార్లు, మైనార్టీ మతపెద్దలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ, ముస్లిం మైనార్టీల అభివృద్ధి కోసం కేటాయించిన భూములను కంచే చేను మేసినట్లుగా ప్రభుత్వం ల్యాంకో హిల్స్ కు అప్పగించిందని, గత ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ టీఆర్ఎస్ ప్రభుత్వం వెనక్కు తీసుకుంటుందని, ల్యాంకో హిల్స్ కు ఇచ్చినవి వక్ఫ్ భూములేనని మరొక కేసు వేస్తామని స్పష్టం చేశారు.

ప్రభుత్వ భూముల పరిరక్షణకై టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతటి కఠిన చర్యలైనా తీసుకుంటుందని, గురుకుల్ ట్రస్ట్ భూముల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతే ఇందుకు ఉదాహరణ అని హరీష్ రావు చెప్పారు. కబ్జా చేసిన వక్ఫ్ భూములను తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని, భూములు ఆక్రమించిన వారు ఎంతటివారైనా వదిలిపెట్టబోమని, ప్రభుత్వ భూముల జోలికి వెళ్ళాలంటే వెన్నులో వణుకు పుట్టాలని, మరొకరు తప్పు చేయకుండా ఉండాలంటే కఠినంగా వ్యవహరించక తప్పదన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *