పదేళ్ళు ఉమ్మడి అడ్మిషన్లు నిర్వహించడం వల్ల తెలంగాణ విద్యార్థులు చాలా నష్టపోతారని, ఎవరి విద్యా వ్యవస్థలు వారికుంటేనే మంచిదని ఉన్నత విద్యాశాఖ మంత్రి జీ జగదీశ్వర్ రెడ్డి అన్నారు. సోమవారం ఎంసెట్ ఫలితాలు విడుదల చేసిన తర్వాత అయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లులో సాధ్యం కాని అంశాలు చాలా ఉన్నాయని, రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఉమ్మడి అడ్మిషన్లు కల్పించడం సరికాదని స్పష్టం చేశారు.
సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు విద్యాశాఖ మంత్రిగా సచివాలయంలోని డీ బ్లాకులో జగదీశ్వర్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తనపై పెద్ద బాధ్యతను పెట్టారని, ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా విద్యావ్యవస్థలో మార్పులు తెస్తానని, కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య అందించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఫీజు రీయింబర్స్ మెంట్ పై క్యాబినెట్ సమావేశంలో నిర్ణయిస్తామని, ప్రస్తుతం ఉమ్మడి రాష్ట్రంలో సంవత్సరంపాటు రెండు రాష్ట్రాలకు సేవలందించే ఉన్నత విద్యామండలితో సహా అన్ని విద్యా సంస్థలను తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తామని మంత్రి పేర్కొన్నారు.