రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధిపై సీఎం కేసీఆర్ శుక్రవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. అన్ని జిల్లా కేంద్రాలనుండి రాజధానికి నాలుగు లైన్ల రోడ్లు, మండల కేంద్రాలనుండి జిల్లా కేంద్రాలకు డబుల్ లైన్ రోడ్లు వేయాలని నిర్ణయించారు. గోదావరి నదిపై మరో రెండు వంతెనలు నిర్మించాలని, రాజీవ్ రహదారిని అదిలాబాద్ జిల్లావరకు విస్తరించాలని, హైదరాబాద్-వరంగల్ రహదారిని నాలుగులైన్ల రహదారిగా మార్చాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఎంత ఖర్చయినా సరే జిల్లాలనుండి ప్రజలు త్వరగా చేరుకోవాలని, అంతేకాకుండా అడ్డూఅదుపూ లేకుండా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు ఫుల్‌స్టాప్ పడాలని సీఎం సూచించారు.
వచ్చే రెండేళ్ళలో రెండువేల కోట్లతో 10 వేల కిలోమీటర్ల రహదారులను మరమ్మతులు చేయాలని, రహదారుల అభివృద్ధి కోసం తెలంగాణ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాట్లను వెంటనే ప్రారంభించాలని అధికారులకు సూచించారు. రహదారి విస్తరణ, అభివృద్ధి కోసం రూ. 750 కోట్లు ఖర్చు చేయనున్నట్లు, ప్రతి నియోజకవర్గంలో సగటున రూ. 110 కోట్ల వరకు కేటాయించనున్నట్లు సీఎం తెలిపారు.