-వడివడిగా బంగారు తెలంగాణవైపు
– పక్కా ప్రణాళికలతో పరిపాలన..
– పథకాలలో తెలంగాణ ఆత్మ
సకలజన ఆమోదం పొందుతున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వం
అస్తిత్వం.. అభివృద్ధి.. ఆధునికత.. ఆత్మగౌరవం..! ఇవీ ఆరు దశాబ్దాల వలసపాలకుల పద ఘట్టనలకింద తెలంగాణ కోల్పోయినవి! వాటికి తోడు యథేచ్చగా వనరుల దోపిడీ.. సకల రంగాల్లో వివక్షతో తెలంగాణ కునారిల్లిపోయింది! చరిత్ర వక్రీకరణకు గురైంది! యాస భాషలు వెక్కిరింతలు చవిచూశాయి! సమాజం నిలువెల్లా గాయపడింది! ఆ గాయాలు బాధలను స్రవిస్తుండగానే ప్రాణాలు ఉగ్గబట్టి.. దశాబ్దాలపాటు పోరుపథాన నడిచి.. ప్రజాస్వామ్యయుతంగా సొంత రాష్ట్రాన్ని సాధించుకుంది!
ఇప్పుడు ఆ పోరాటం పాలనగా మార్పు చెందింది! ప్రజలకు కావాల్సినవి ఇవీ.. అంటూ ఎవరైతే కొట్లాడారో.. వారే ఇప్పుడు పాలకులు! అందుకే సబ్బండవర్ణాలకు మేలు చేసే నిర్ణయాలు! అది ఒక సంస్థకు తెలంగాణ జాతి పిత జయశంకర్‌సారు పేరు పెట్టుకున్నా.. తెలంగాణ గుండెకాయ హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరాల సరసన నిలిపేందుకు ప్రతినబూనినా.. అందులో తెలంగాణ ప్రగతిబాటన నడువాలనే తపన! ఒకప్పుడు ప్రపంచ స్థాయి పారిశ్రామిక నగరమైన హైదరాబాద్‌కు తిరిగి నాటి వైభవం కల్పించేందుకు ఆతృత! ఇకనైనా తెలంగాణవాసి బతుకు బాగుపడాలనే ఆశ! ఆ ఆశకు అంకురం.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం! ఆ ఆశకు అడ్డుపడేవారి పాలిటి అంకుశం ఆ ప్రభుత్వానికి నేతృత్వం వహించే కేసీఆర్!!
రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గరి నుంచి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అభివృద్ధి పథాన జెట్ స్పీడ్‌తో దూసుకుపోతున్నారు. ఆత్మగౌరవాన్ని, అస్తిత్వాన్ని కాపాడుకుంటూ.. అధునాతనమైన బంగారు తెలంగాణకు బాటలు వేసేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా అభివృద్ధిపరమైన అంశాల్లో తాత్సారం లేనివిధంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రజల అభిమానాన్ని చూరగొంటున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్.. ప్రణాళికాయుతంగా పాలన సాగిస్తున్నది. ఐదేండ్లపాటు సుస్థిర, సమర్ధ పాలన సాగించేందుకు సీఎం పక్కా వ్యూహాలను రచిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ప్లాన్ యువర్ విలేజ్- ప్లాన్ యువర్ మండల్- ప్లాన్ యువర్ డిస్ట్రిక్-ప్లాన్ యువర్ స్టేట్ నినాదంతో ముందుకు సాగుతున్నారు. సాధ్యమైతేనే చేస్తమని చెబుతం. కాకపోతే కాదంటం. మాయ మాటలతో మభ్యపెట్టం అని తరచూ తన ప్రసంగాల్లో చెప్పే సీఎం కేసీఆర్.. అక్షరాలా అదే బాటలో పయనిస్తున్నారు. హైదరాబాద్ పోలీసులకు కొత్త వాహనాలు ఇస్తామన్నారు. చేసి చూపించారు. తెలంగాణ రాష్ట్రంలో నూతన పారిశ్రామిక విధానం తీసుకొస్తామని చెప్పిన కేసీఆర్.. విధానాల రూపకల్పనను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. హైదరాబాద్ పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచంలోని ఏ దేశం నుంచైనా పరుగెత్తుకు వచ్చేలా నూతన పారిశ్రామిక విధానానికి కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టేందుకు వచ్చే వారికి పచ్చని భూములు కేటాయించకూడదని నిర్ణయించిన ప్రభుత్వం.. సాగుకు ఉపయోడపడని భూములను మాత్రమే కేటాయించాలని సంకల్పించింది. పరిశ్రమలన్నిటినీ హైదరాబాద్‌లో కేంద్రీకరించకుండా, ఔటర్ రింగ్ రోడ్డుకు బయటే ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం పరిశ్రమల శాఖల అధికారులను ఆదేశించారు. రాజకీయ పార్టీలు ఎన్ని విమర్శలు, ఆరోపణలు చేసినా ఇంటింటి సమగ్ర సర్వేను విజయవంతంగా పూర్తి చేయడం ద్వారా తాను మాటల మనిషి కాదు.. చేతల మనిషినని కేసీఆర్ నిరూపించుకున్నారు. వాస్తవానికి ఇంటింటి సమగ్ర సర్వే తెలంగాణవ్యాప్తంగా అద్భుతమైన ఫలితాన్నిచ్చింది.
తెలంగాణ ప్రజానీకం మొత్తం ఇళ్ల వద్దే ఉండి తమ వివరాలు నమోదు చేయించుకున్నారు. ఇందిరమ్మ ఇండ్లలో మోసాలు జరిగినట్లు రికార్డులున్న నేపథ్యంలో.. విచారణకు ఆదేశించి సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇందిరమ్మ ఇండ్లలో కోట్లు మింగేసిన తిమింగలాలకు కేసీఆర్ నిర్ణయం మింగుడుపడడం లేదు. ఏ క్షణంలో జైలు ఊచలు లెక్కించాల్సి వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. ఇండ్లు నిర్మించినట్లు లెక్కలున్నా ఆయా గ్రామాల్లో ఇండ్లే కట్టలేదు. ఈ విషయంలో ముఖ్యమంత్రి చాలా స్పష్టమైన వైఖరితో ఉన్నారు. ఎన్ని కష్టాలు భరించయినా నూరు శాతం సంక్షేమ పథకాలు అమలు చేయడంతోపాటు.. ఆ పథకాలు నిజమైన లబ్ధిదారులకు అందేందుకు కసరత్తు చేస్తున్నారు.
అలాగే రేషన్‌కార్డులకు సంబంధించి కార్డుల సంఖ్యనుబట్టి విడుదలవుతున్న బియ్యం నిజమైన లబ్ధిదారులకు చేరడం లేదని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో నివసించే కుటుంబాలు 84 లక్షలైతే, జారీ చేసిన తెల్ల రేషన్ కార్డుల సంఖ్య 91 లక్షలుగా ఉంది. తెల్ల రేషన్‌కార్డులు కాకుండా రెండు లక్షలపైచిలుకు అంత్యోదయ కార్డులు, మరో 15 లక్షల గులాబీ రేషన్ కార్డులు ఉన్నాయి. అంటే మొత్తంగా చూస్తే కోటి ఏడు లక్షల రేషన్ కార్డులు జారీ చేసినట్లుగా లెక్కల్లో ఉంది. అంటే 22 లక్షల రేషన్‌కార్డులు అదనంగా జారీ అయినట్లు సీఎం గుర్తించారు. ఇక పంచాయితీరాజ్ శాఖలో స్థానిక స్వపరిపాలన సోయిని తిరిగి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు. నిజమైన స్థానిక స్వపరిపాలనను ఆచరణలో చూపేందుకు నడుం కట్టారు.
సర్పంచ్‌నే రాజుగా మార్చే నిజమైన పంచాయతీరాజ్‌కు తెలంగాణలో పునాదులేస్తున్నారు. కరెంట్ కష్టాలు వెంటాడుతున్న వెరవకుండా ధైర్యంగా ఎదుర్కొంటున్నారు. వాస్తవాలను ఎప్పటికప్పుడు ప్రజలకు వివరిస్తూ.. సాధ్యమైనంత వరకూ అదనపు విద్యుత్ కొనుగోలు చేసేందుకు శ్రమిస్తున్నారు. విద్యుత్ ఏ రాష్ట్రంలో అందుబాటులో ఉన్నా, కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రతి సంవత్సరం 1000 మెగావాట్ల చొప్పున మూడేండ్లలో 3 వేల మెగావాట్ల విద్యుత్‌ను సొంతంగా ఉత్పత్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ మొదటి మూడేండ్లలో కొన్ని కష్టాలు తప్పవనే విషయాన్ని సీఎం ప్రజలకు వివరిస్తున్నారు.
మరోవైపు దళిత, గిరిజన, బీసీ, మైనార్టీవర్గాల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తున్నారు. అందులో భాగంగానే దళిత సంక్షేమ శాఖ పేరును ఎస్సీ అభివృద్ధి శాఖగా మార్చారు. అంతేకాకుండా ఆ శాఖను సీఎం స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. రాబోయే మూడేండ్లలో దళితవాడల నుంచి దారిద్య్రాన్ని తరమేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి పని చేస్తున్నారు. అందులో భాగంగానే తెలంగాణ బడ్జెట్‌లో ఈ శాఖకు ప్రత్యేక కేటాయింపులు జరిపేందుకు కసరత్తు జరుగుతున్నది. రాబోయే రోజుల్లో ఎక్కడ ఇరిగేషన్ ప్రాజెక్టు చేపట్టినా కచ్చితంగా రెండు అంశాలను పరిగణలోకి తీసుకోవాలని సీఎం సూచించారు. పాత లేదా కొత్త ప్రాజెక్టుల్లోని 10-15 శాతం నీటిని రక్షిత తాగునీటి కోసం కేటాయించి, ప్రజలకు అందేలా చేయడం, మరోవైపు తెలంగాణ పారిశ్రామిక అభివృద్ధికి కావలసిన నీటిని కూడా కొంత శాతం కేటాయించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సీఎం సూచించారు.
ప్రత్యేక వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేయడం ద్వారా వచ్చే నాలుడేండ్లలో తెలంగాణలోని ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ ఉండేలా చూస్తామని ప్రకటించారు. వ్యవసాయపరంగా ఈసారి ప్రకృతి పెద్దగా సహకరించకపోయినా.. ఖరీఫ్ చివర్లో తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురవడంతో పరిస్థితి కాస్తంత మెరుగుపడిందనే చెప్పవచ్చు. భూసార పరీక్షల వివరాలు కంప్యూటర్లలో నిక్షిప్తమై జిల్లా కలెక్టరేట్‌లో కూడా ఉండాలని సీఎం సూచించారు. మైక్రో లెవల్ నుంచి మాక్రో లెవల్ వరకు వ్యవసాయ శాఖలో ప్లానింగ్ జరగాలనేది సీఎం అభిమతం.
పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఇప్పుడే పూర్తికావు కాబట్టి, గ్రామాల్లోని చెరువులను ఆధునీకరించే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్నది. ప్రభుత్వ శాఖలు ఏదైనా పనులు చేపట్టేటప్పుడు ప్రజల ఆలోచనలను కూడా పరిగణలోకి తీసుకోవాలనేది సీఎం ఆలోచన. పథకాల్లో ప్రజలను భాగస్వాములను చేయడం ద్వారా పారదర్శక పాలన అందించడంతో పాటు, అవినీతికి తావులేకుండా చేయవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఇలా ప్రతి అంశంలోనూ సీఎం ప్రత్యేక చొరవతో ముందుకు సాగుతూ… ప్రజల మన్నన్నలు పొందుతున్నారు. చేసేదే చెబుతం.. చెప్పిందే చేస్తం అంటూ ముఖ్యమంత్రిగా సమర్ధ పనితీరు కనపరుస్తూ… ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అందుకోలేని స్పీడ్‌తో అభివృద్ధిపథంలో దూసుకుపోతున్నారు.
రాజకీయ పార్టీలు ఎన్ని విమర్శలు, ఆరోపణలు చేసినా ఇంటింటి సమగ్ర సర్వేను విజయవంతంగా పూర్తిచేయడం ద్వారా తాను మాటల మనిషి కాదు.. చేతల మనిషినని ముఖ్యమంత్రి కేసీఆర్ నిరూపించుకున్నారు. ఇంటింటి సమగ్ర సర్వే తెలంగాణవ్యాప్తంగా అద్భుతమైన ఫలితాన్నిచ్చింది. తెలంగాణ ప్రజానీకం మొత్తం ఇళ్ల వద్దే ఉండి తమ వివరాలు నమోదు చేయించుకున్నారు.
Source: [నమస్తే తెలంగాణ]