మహానాడులో కార్యకర్తలను, నాయకులను ఉత్తేజపరచడానికి పడరాని పాట్లు పడ్డ చంద్రబాబుకు, ఆ సంబరాలు ముగిసిన 24 గంటల్లోనే పెద్ద షాక్ తగిలింది. తెలంగాణపై తెదేపా అస్పష్ట విధానాల కొనసాగింపుకు నిరసనగా ఆ పార్టీ నేత, ప్రముఖ వస్త్ర వ్యాపారి మర్రి జనార్ధన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు.
నిన్న మహబూబ్ నగర్ లో పత్రికా సమావేశం నిర్వహించిన మర్రి జనార్ధన్ రెడ్డి జూన్ 2 నాడు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరనున్నట్టు ప్రకటించాడు.
గత యేడాది జరిగిన నాగర్ కర్నూల్ శాసన సభ ఉప ఎన్నికల్లో మర్రి జనార్ధన్ రెడ్డి తెలుగుదేశం అభ్యర్ధిగా పోటీ చేశారు. చిన్న వస్త్ర వ్యాపారిగా జీవితం మొదలుపెట్టిన జనార్ధన్ రెడ్డి స్వయంకృషితో అంచెలంచలుగా ఎదిగారు. నగరంలో ప్రఖ్యాతి గాంచిన జేసీ బ్రదర్స్ క్లాత్ షోరూములు మర్రి జనార్ధన్ రెడ్డివే.
ఒకప్పుడు జిల్లాలో ఎంతో బలంగా ఉన్న తెలుగుదేశం ఇప్పుడు అగ్ర నాయకుల వలసలతో దయనీయ స్థితిలో ఉంది. ఒకే రోజు అటు కాంగ్రెస్ నుండి మందా జగన్నాధం, ఇటు తెదేపా నుండి మర్రి జనార్ధన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరుతున్నట్టు ప్రకటించడంతో జిల్లాలో తెలంగాణ ఉద్యమానికి గొప్ప ఊపు వచ్చింది.