mt_logo

జగ్గారెడ్డి గెలిస్తే రాజకీయాలనుండి తప్పుకుంటా – హరీష్ రావు

మెదక్ లోక్ సభ ఉప ఎన్నికలో బీజేపీ, అభ్యర్థి జగ్గారెడ్డి గెలిస్తే రాజకీయాలనుండి తప్పుకుంటానని, భారీ నీటిపారుదల శాఖామంత్రి టీ హరీష్ రావు పేర్కొన్నారు. జగ్గారెడ్డి గెలిస్తే మంత్రిపదవికి రాజేనామా చేయడానికి సిద్ధమా? అని హరీష్ రావుకు టీడీపీ నేత ఎర్రబెల్లి సవాల్ విసిరిన నేపథ్యంలో హరీష్ పై వ్యాఖ్యలు చేశారు. ఉపఎన్నికలో జగ్గారెడ్డి గెలిస్తే పదవికి రాజీనామా చేయడంతో పాటు రాజకీయ సన్యాసం తీసుకుంటానని, జగ్గారెడ్డి ఓడితే నువ్వు రాజకీయ సన్యాసం తీసుకుంటావా ఎర్రబెల్లీ? అని హరీష్ రావు ప్రశ్నించారు. సంగారెడ్డిలో గురువారం స్థానిక ఎమ్మెల్యే చింతాప్రభాకర్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి హరీష్ రావుతో పాటు పలువురు టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు పాల్గొని ప్రసంగించారు.

నామినేషన్ వేసినరోజే టీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి విజయం ఖాయమైందని, భారీ మెజారిటీ కోసమే ప్రచారం చేస్తున్నామని హరీష్ రావు చెప్పారు. జగ్గారెడ్డికి ఓటేస్తే సీమాంధ్రులకు వేసినట్టేనని మెదక్ ప్రజలు ఎప్పుడో గుర్తించారని, తెలంగాణ ద్రోహి జగ్గారెడ్డిని చిత్తుచిత్తుగా ఓడిస్తారని, పక్క రాష్ట్రం నేతలు చంద్రబాబు, వెంకయ్యనాయుడు , పవన్ కళ్యాణ్ సూచించిన జగ్గారెడ్డికి బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి టిక్కెట్ ఇచ్చారని, బీజేపీ, టీడీపీలో ఇంకా ఆంధ్రోళ్ళ పెత్తనమే కొనసాగుతుందనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలని ప్రశ్నించారు. ఈ సమావేశంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదిరెడ్డి, ఆరూరి రమేష్, చాగండ్ల నరేంద్రనాథ్, మాజీ మంత్రి ఫరీదుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *