శుక్రవారం మిర్యాలగూడలో జరిగిన నల్లగొండ పార్లమెంట్ స్థాయి ఎన్నికల బహిరంగ సభకు ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్ రావు, తెలంగాణ రాష్ట్ర రైతు సమితి అధ్యక్షుడు గుత్తా సుఖేందర్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి జీ జగదీశ్ రెడ్డి, హుజూర్ నగర్ టీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి సైదిరెడ్డి, ఎంపీ కేశవరావు, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ దేశ భవిష్యత్తును నిర్ణయించే ఈ పార్లమెంటు ఎన్నికలు ఎంతో కీలకమైనవని, ప్రస్తుతం దేశాన్ని పాలించే సత్తా సీఎం కేసీఆర్ ఒక్కరికే ఉందని స్పష్టం చేశారు. 70 ఏండ్ల కాంగ్రెస్, బీజేపీ పాలనలో ప్రజలకు ఒరిగింది ఏదీ లేదని, రెండు పార్టీలు అధికార దాహంతో ప్రజా సమస్యలు విస్మరించాయని మండిపడ్డారు.
తెలంగాణ వారికి పాలన చేతకాదని ఎగతాళి చేసిన వారికి సీఎం కేసీఆర్ దేశానికే ఆదర్శవంతమైన పాలన అందించి దీటైన సమాధానం చెప్పారని జగదీశ్ రెడ్డి ప్రశంసించారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను ఇతర రాష్ట్రాలు స్ఫూర్తిగా తీసుకుని అమలుచేసేందుకు ఆసక్తి చూపుతుండటం గొప్ప విషయమని అన్నారు. యూపీఏ, ఎన్డీయే భాగస్వామ్య పక్షాలకు సరిపడా సీట్లు వచ్చే అవకాశం లేదని, ఈ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల హవా కొనసాగుతుందని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో 17 ఎంపీ స్థానాలకు గానూ 16 స్థానాల్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు.
అనంతరం నల్లగొండ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహారెడ్డి మాట్లాడుతూ తాను కొత్తగా రాజకీయాల్లోకి వచ్చానని, కొత్తవాడు ఏం చేస్తాడంటూ కొందరు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టారు. తాను 1987 నుండే రాజకీయాల్లో ఉన్నానని, ఎంపీపీగా పోటీ చేసినట్లు చెప్పారు. తెలంగాణ వాదిగా ఉద్యమానికి తనవంతు చేయూతనందిస్తూ కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచానని చెప్పారు. ప్రజాసేవ చేయాలనే తన ఆకాంక్షను గుర్తించిన సీఎం కేసీఆర్ తనకు ఎంపీ అభ్యర్థిగా అవకాశం కల్పించారని వేమిరెడ్డి నర్సింహారెడ్డి తెలిపారు.