mt_logo

తన బాస్‌లను సంతృప్తి పరిచేందుకే రేవంత్ నిన్న కొత్త తల్లిని సృష్టించాడు: జగదీశ్ రెడ్డి

తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సంధర్బంగా మాట్లాడుతూ.. ఏడాది కాంగ్రెస్ పాలన విజయోత్సవ సంబరాల్లో తెలంగాణ సంస్కృతి మంటగలిసింది. సాంస్కృతిక కార్యక్రమాల పేరిట సినిమా పాటలు పాడించారు. ఈ మత్తులో పడే ఉన్న తెలంగాణను ఊడగొట్టి ఆనాడు ఆంధ్రాలో కలిపారు అని దుయ్యబట్టారు.

ఆరవై సంవత్సరాలు కాంగ్రెస్ నాయకులు ఈ మత్తులో పడి తెలంగాణ సంస్కృతిని ధ్వంసం చేశారు. తెలంగాణ భాష, యాసను ఉమ్మడి రాష్ట్రంలో తొక్కేశారు. శాసనసభలో నాడు తెలంగాణ పదాన్నే నిషేధించే స్థాయికి వెళ్లారు అని విమర్శించారు.

అలాంటి సంస్కృతి పెరుగుతున్న సమయంలోనే జయశంకర్ సార్ లాంటి వాళ్ళు ఉద్యమాన్ని చేపట్టారు. నేలతల్లిని విముక్తి చేయాలని ఆనాడే తెలంగాణ ఉద్యమకారులు కంకణం కట్టుకున్నారు. కేసీఆర్ ఇరుసులా ఉండి ఉద్యమాన్ని కొనసాగించారు. అన్ని రకాల సాంస్కృతిక దాడులను తిప్పికొట్టిన నేత కేసీఆర్ అని గుర్తు చేశారు.

బతుకమ్మను వ్యాప్తి చేసినా, గోదావరి, కృష్ణ పుష్కరాలను ఘనంగా జరిపినా అది కేసీఆర్ ఉద్యమ చలవే. తెలంగాణ ఉద్యమం నుంచే తెలంగాణ తల్లి పుట్టింది. తెలంగాణ తల్లి దేవతా మూర్తిలా ఉండి ఉద్యమానికి ప్రేరణగా నిలిచింది. తెలంగాణ తల్లికి నాటి ఉద్యమమే భౌతిక రూపం ఇచ్చింది. అనేక కళారూపాలతో నాడు తెలంగాణ భవన్‌లో తెలంగాణ తల్లిని ప్రతిష్టించుకున్నాం అని తెలిపారు.

నిన్న తెలంగాణ తల్లి పేరుతో ఏ రూపాలతో ప్రతిష్టించారో అందరికీ తెలుసు.తెలంగాణ తల్లిని చంపుతా అని తుపాకీ పట్టుకుని బయలుదేరిన వాడు కొత్త తల్లిని తీసుకొచ్చాడు. కిరాయి రాతగాళ్ళు రాసిచ్చిన స్క్రిప్ట్ నిన్న సీఎం చదివారు. ఇది తెలంగాణ సంస్కృతిపైన జరుగుతున్న భయంకర దాడి అని జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.

దారితప్పి ఆ దొంగల వెంట ఉన్న తెలంగాణవాదులు పునరాలోచించుకోవాలి. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే రకం వాళ్ళు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ పేరిట అడ్డమైన పాటలు పాడారు. సమైక్యవాదులు 80 ఏళ్ల కింద పన్నిన కుట్ర మళ్ళీ మొదలైంది. తెలంగాణ తల్లి పేరిట నిన్న జరిగిన ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఏ ఒక్కరికి తెలంగాణ భావోద్వేగం లేదు. మా సంస్కృతిని మరిపించే ప్రయత్నాలు జరిగినా వాటిని తిప్పికొట్టాం అని అన్నారు.

కేసీఆర్ హయంలో బతుకమ్మను అధికారికంగా జరిపాం.. బతుకమ్మ చీరలు ఇచ్చాం. సమైక్య బాస్‌లను సంతృప్తి పరిచేందుకు నిన్న కొత్త తల్లిని సృష్టించారు. మన సంస్కృతిని పరాధీనం చేసే కుట్ర జరుగుతోంది. తెలంగాణకు సంబంధం లేని ఆటలు పాటలు మళ్ళీ రుద్దుతున్నారు. తెలంగాణవాదులు అప్రమత్తం కావాలి.. ఉద్యమం సృష్టించిన తల్లే మన తల్లి అని పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ పార్టీ గుర్తును ప్రచారం చేసుకునేందుకే కొత్త తల్లిని తెచ్చారు. ఎవర్ని భయపెట్టి కొత్త తల్లికి దండం పెట్టించలేవు. మేము కూడా ఎవర్ని దండాలు పెట్టాలని ఆనాడు కోరుకోలేద. కోట్లాది ప్రజలు సృష్టించిన తెలంగాణ తల్లికి అధికారిక గెజిట్‌లో స్థానం ఎందుకు? అని అడిగారు.

ప్రజల మెడ మీద కత్తి పెట్టి కొత్త తల్లిని ఆరాధించాలని అడిగే హక్కు ఎవరికీ లేదు. అధికారం ఉందని ఆహారపు అలవాట్లపై, కట్టుబాట్లపై ఆంక్షలు పెడితే కుదురుతుందా? ఆ జీవోను అధికారులు ఎలా తెచ్చారో అర్థం కావడం లేదు. ఈ ముఖ్యమంత్రి చదువుకోలేదు కాబట్టే పిచ్చి జీవోలు తెస్తున్నారు. కోయిలలు ఉన్న చోట కాకిలా ప్రవర్తించి దృష్టిని ఆకర్షించాలనేది ఈ మూర్ఖపు సీఎం ఆలోచన అని జగదీశ్ రెడ్డి ఫైర్ అయ్యారు.