mt_logo

తెలంగాణ ఉద్యమంలో కలికితురాయి టీ జేఏసీ

తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన తెలంగాణ జేఏసీ 2009 లో ఏర్పడింది. యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఇస్తానని 2009 లో చెప్పి మాట తప్పడంతో ప్రొఫెసర్ కోదండరాం చైర్మన్ గా తెలంగాణ జేఏసీ ఏర్పాటైంది. కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్, బీజేపీ, న్యూ డెమోక్రసీ పార్టీలు, మేధావుల సంఘాలు, ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు మొదలైనవి దీనిలో చేరాయి. 2011 నుండి ఉద్యమాన్ని తెలంగాణ జేఏసీ ఉధృతం చేసింది. అంతకు ముందు టీఆర్ఎస్ ఒక్కటే ఉద్యమ వేదికగా ఉండేది. దీని రాకతో ఉద్యమంలో బలమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఫిబ్రవరి 17, 2011 న మొదలైన సహాయనిరాకరణ మార్చి 4 వ తేదీన విరమించారు. అన్ని రంగాల్లో స్తబ్దత చోటుచేసుకుని ప్రజా జీవనం ఆగిపోయింది. సింగరేణి సంస్థ మూతబడి విద్యుత్ రంగం దెబ్బతింది. దేశం మొత్తం తెలంగాణ వైపు చూసేలా ఈ ఉద్యమం సాగింది. తర్వాత జరిగిన మిలియన్ మార్చ్ లో వేలాదిమంది ట్యాంక్ బండ్ పై ప్రదర్శన చేశారు. ట్యాంక్ బండ్ పై ఉన్న సీమాంధ్ర నాయకుల విగ్రహాలను తొలగించి హుస్సేన్ సాగర్ లో పడేశారు. హైదరాబాద్ ఫ్రీ జోన్ అని చెప్పే 14 ఎఫ్ ను తొలగించేలా ప్రభుత్వంపై ఒత్తిడిచేయడానికి మరోసారి ఉద్యమం ప్రారంభించింది. సకలజనుల సమ్మె తెలంగాణ జేఏసీ చరిత్రలో లిఖించదగ్గ ఉద్యమం. 2012, సెప్టెంబర్ 30 న జరిగిన సాగరహారంలో వేలాదిమంది తెలంగాణవాదులు హైదరాబాద్ వచ్చి భారీ వర్షాన్ని కూడా లెక్కచేయకుండా సభలో పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని డిల్లీలో వినిపించేందుకు ప్రత్యేక రైలులో తెలంగాణ వాదులు సంసద్ యాత్ర చేశారు. తర్వాత బయ్యారం ఉక్కు-తెలంగాణ హక్కు నినాదంతో యాత్ర చేపట్టి విజయవంతం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేందుకు ఛలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో టీఆర్ఎస్ పార్టీ పాల్గొని కీలక పాత్ర పోషించింది. జాతీయ పార్టీల నేతలతో డిల్లీలో అఖిలపక్ష సమావేశం జరిపి మొదటిసారి అన్ని పార్టీలనుండి అనుకూలత వచ్చేలా జేఏసీ కృషి చేసింది. తెలంగాణ అంశాన్ని ముందుకు తీసుకెళ్లనందుకు నిరసనగా నిజాం కాలేజీ గ్రౌండ్ లో నిర్వహించిన సకలజనభేరి సభకు భారీ సంఖ్యలో తెలంగాణ ప్రజలు వచ్చి విజయవంతం చేశారు. తెలంగాణ బిల్లు ఉభయసభల్లో ఆమోదం పొందడానికి ఆని పార్టీల జాతీయనేతలను కలిసి బిల్లుకు మద్దతు తెలిపేలా తీవ్ర కృషి చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగడంలో ముఖ్యపాత్ర పోషించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *