mt_logo

జానా, పొన్నాల విమర్శలు పీసీసీ పదవి కోసమే – హరీష్ రావు

విమర్శించే ముందు ఆత్మ విమర్శ చేసుకోవాలని, కాంగ్రెస్, టీడీపీ పార్టీలకు టీఆర్ఎస్ పై విమర్శలు చేసే నైతిక హక్కులేదని భారీ నీటిపారుదల శాఖా మంత్రి టీ హరీష్ రావు మండిపడ్డారు. 67 ఏళ్లుగా అధికారంలో ఉండి ఇన్నేళ్ళూ అభివృద్ధి చేయని కాంగ్రెస్ పార్టీ 67 రోజుల పసిగుడ్డు తెలంగాణ ప్రభుత్వం చేయాలని అడుగుతున్నారని, తెలంగాణకు మీరు చేసిన అన్యాయాలు, పొరపాట్లు సవరించడం అంత సులువైన పని కాదని, ఇంతకాలం మీరు చేసిన పాపాలను కడగడం 67 రోజుల్లో సాధ్యమవుతుందా? అని కాంగ్రెస్, టీడీపీ పార్టీలను ప్రశ్నించారు.

గురువారం టీఆర్ఎస్ఎల్పీ లో జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, వెంకటేశ్వర్లు, శంకర్ నాయక్ తదితరులు పాల్గొని మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వం కొద్దిరోజుల్లోనే ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుందని, మంత్రిమండలిలో 40 కిపైగా అంశాలు ఆమోదిస్తే వాటిలో పది అంశాల అమలు మొదలైందని అన్నారు. పీసీసీ కుర్చీ కాపాడుకోవడం కోసమే పొన్నాల, జానారెడ్డి పోటీపడి మరీ తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారన్నారు.

గత సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి అనంతపురంలో రైతులకు పరిహారం ఇచ్చారుకానీ, తెలంగాణకు నయాపైసా ఇవ్వకపోయినా అధికారంలో ఉన్న జానారెడ్డి, పొన్నాల కనీసం నోరుతెరిచి అడగలేదని, ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇవ్వకపోయినా 405కోట్ల ఇన్ పుట్ సబ్సిడీని విడుదల చేశారని చెప్పారు. ఎర్రకోటపై మోడీ జాతీయ జెండా ఎగరేస్తే లేని తప్పు కేసీఆర్ గోల్కొండ కోటపై ఎగరేస్తే తప్పెలా అవుతుందని బీజేపీ నేతలను విమర్శించారు.

తెలంగాణ సీఎం దిష్టిబొమ్మను టీఎన్ఎస్ఎఫ్ దహనం చేయడాన్ని టీ టీడీపీ నేతలు సమర్ధించడం పట్ల హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతవరకు ఫీజు రీయింబర్స్ మెంట్ ప్రకటించని ఏపీ సీఎం చంద్రబాబు దిష్టిబొమ్మను ఎందుకు తగలపెట్టడం లేదని, ఇది రాజకీయం కాదా? అని ప్రశ్నించారు. తెలంగాణ పార్టీ అధ్యక్షుడి కుర్చీ కోసం మీలో మీరే కొట్లాడుకుంటున్నారు. మీకో నాయకుడు లేడు. తెలంగాణ పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకోలేని నిస్సహాయస్థితిలో మీరున్నారని హరీష్ రావు ఎద్దేవా చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *