సోమవారం ఐటీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రదీప్ దొబాలే, చీఫ్ ఎగ్జిక్యూటివ్ సంజయ్ సింగ్, మైక్రోసాఫ్ట్ ఇండియా చైర్మన్ భాస్కర్ ప్రామాణి, హిందూజా గ్రూప్ చైర్మన్ అశోక్ హిందూజా తదితరులు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావును కలిశారు. తెలంగాణలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, ఆహార పదార్థాల తయారీ యూనిట్లను, 3500 కోట్లతో కాగితపు పరిశ్రమ నెలకొల్పుతామని ఈ సందర్భంగా సీఎం కు వారు వివరించారు. లక్ష ఎకరాల్లో సర్వీ చెట్లను పెంచుతామని, అందుకు అవసరమైన స్థలాన్ని ఇవ్వాలని కోరారు. దీనిపై సీఎం అనుకూలంగా స్పందిస్తూ పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం తరపున అన్ని చర్యలు తీసుకుంటామని, పూర్తి సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు.
మరోవైపు మైక్రోసాఫ్ట్ కంపెనీ తెలంగాణ వ్యాప్తంగా సేవలను విస్తరించేందుకు సమాయత్తమైంది. సచివాలయంలో సీఎం కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తో మైక్రోసాఫ్ట్ ఇండియా చైర్మన్ భాస్కర్ ప్రామాణి సమావేశమై త్వరలో రాష్ట్రంలో మైక్రోసాఫ్ట్ సేవలను విస్తరిస్తామని, దీనివల్ల వందలమందికి ఉపాధి కలుగుతుందని హామీ ఇచ్చారు. త్వరలో హైదరాబాద్ రానున్న మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ళకు రాష్ట్ర ప్రభుత్వం తరపున సన్మానం చేస్తామని కేసీఆర్ చెప్పారు.
హిందూజా గ్రూప్ చైర్మన్ అశోక్ హిందూజా కూడా సీఎం కేసీఆర్ ను కలిసి పరిశ్రమలు నెలకొల్పే విషయమై చర్చలు జరిపారు. ఒప్పందం ప్రకారం రాష్ట్రానికి రావలసిన విద్యుత్ ను సరఫరా చేయాలని అశోక్ హిందుజాను సీఎం కోరారు. రాష్ట్రవ్యాప్తంగా పరిశ్రమలు నెలకొల్పేందుకు ప్రముఖ సంస్థలు ముందుకు వస్తుండటం పట్ల కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు.