mt_logo

ఐటీ విజన్ అద్భుతంగా ఉందని ప్రశంసించిన గవర్నర్ నరసింహన్

మంగళవారం రాజ్ భవన్ లో ఐటీ మంత్రి కేటీఆర్ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తో సమావేశమై పంచాయితీ రాజ్, ఐటీ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలు, వాటి అమలు తీరుపై వివరించారు. రాష్ట్రంలో ఐటీ రంగ విస్తరణకు ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఐటీఐఆర్ ప్రాజెక్టు, ఇంక్యుబేటర్, గేమ్ సిటీ, ఐటీ హబ్, టాస్క్ లనాటి ప్రాజెక్టులకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యం, వాటి ప్రాముఖ్యతను గవర్నర్ కు తెలిపారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం విస్తరణకు ప్రభుత్వం రూపొందించిన ఐటీ విజన్ అద్భుతంగా ఉందని, ఐటీ రంగం ప్రజలకు మరింత ఉపయోగపడేలా మెరుగైన టెక్నాలజీ అందుబాటులోకి తేవాల్సి ఉందని గవర్నర్ పేర్కొన్నారు.

రాష్ట్రంలో ఏటా లక్షమంది ఇంజినీరింగ్ విద్యార్థులు బయటికొస్తున్నా, ఉపాధి అవకాశాలు దక్కించుకోవడంలో వెనుకబడుతున్నారని ఈ సందర్భంగా గవర్నర్ అన్నారని తెలిసింది. ఈ పరిస్థితిని మార్చేందుకు ఇంజినీరింగ్ విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచే చర్యలు చేపడుతున్నామని, అందుకోసం టాస్క్(టెక్నాలజీ ఫర్ స్కిల్ డెవలప్ మెంట్ అండ్ నాలెడ్జ్ సెంటర్) పథకాన్ని రూపొందించినట్లు మంత్రి గవర్నర్ కు వివరించారు.

హైదరాబాద్ లో వైఫై టెక్నాలజీకి అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడానికి చర్యలు తీసుకుంటున్నట్లు కూడా మంత్రి గవర్నర్ కు తెలిపారు. గవర్నర్ తో సమావేశం అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ, గవర్నర్ తో సుమారు గంటపాటు జరిగిన సమావేశంలో ప్రభుత్వ కార్యక్రమాలను వివరించినట్లు, గవర్నర్ కూడా ప్రభుత్వానికి పలు నిర్ణయాత్మక సలహాలు ఇచ్చారని, వాటి ఆధారంగా ప్రభుత్వం మరింత మెరుగైన కార్యక్రమాలు చేపడుతుందని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *