రాష్ట్ర ఐటీ, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి కే తారక రామారావు ఈరోజు మహబూబ్ నగర్ జిల్లాకు చేరుకొని పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లాకు చేరుకున్న ఆయనకు టీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. అప్పన్నపల్లిలో నిర్మించిన రైల్వే ఓవర్ బ్రిడ్జిని కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ, సమైక్య రాష్ట్రంలో ఎక్కువగా నష్టపోయిన జిల్లా ఏదైనా ఉందంటే అది పాలమూరు జిల్లా అని, జూరాల, పాకాల, పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను చేపట్టి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని హామీ ఇచ్చారు.
వచ్చే మంత్రివర్గ విస్తరణలో పాలమూరుకు పెద్ద పీట వేస్తామని, మంచినీటి సమస్య తీర్చేందుకు కృషి చేస్తామని, జడ్చర్ల నుండి మహబూబ్ నగర్ వరకు నాలుగు లైన్ల రోడ్డును నిర్మిస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ గా రూపొందిస్తామని, తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. మూడు రంగాలకు చెందిన ఐటీ కంపెనీలతో రేపు రాత్రి ఏడు గంటలకు హైదరాబాద్ లో సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో ఆహార ధాన్యాల నిల్వ కోసం 20 లక్షల టన్నుల సామర్ధ్యం కలిగిన గోడౌన్లను నిర్మించనున్నట్లు కేటీఆర్ చెప్పారు.