నిర్మల్ భారత్ అభియాన్, జాతీయ గ్రామీణ తాగునీటి పథకం, ఐటీ ప్రాజెక్టుల నిర్వహణపై వివిధ రాష్ట్రాల మంత్రులు, ఉన్నతాధికారులతో సోమవారం నుండి రెండు రోజులపాటు కేంద్రప్రభుత్వం నిర్వహించనున్న సమీక్షా సమావేశాలకు ఐటీ, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి కే తారకరామారావు హాజరవ్వనున్నారు. ఇందుకోసం మంత్రి కేటీఆర్ తోపాటు పంచాయితీ రాజ్ శాఖ ముఖ్యకార్యదర్సి జే రేమండ్ పీటర్, గ్రామీణ తాగునీటి సరఫరా చీఫ్ ఇంజనీర్ సురేందర్ రెడ్డి తదితరులు సోమవారం ఉదయం ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు.
కేంద్రం నుండి విడుదల అవుతున్న నిధులతో పాటు రాష్ట్రంలో అమలులో ఉన్న తాగునీరు, పారిశుధ్య నిర్వహణ ప్రాజెక్టుల అభివృద్ధి, నిధుల వినియోగం తీరును మంత్రి కేటీఆర్ ఈ సమావేశంలో వివరించనున్నారు. రాష్ట్రంలో తాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ కోసం 200 కోట్ల రూపాయల ప్రతిపాదనలను కేంద్రానికి సమర్పిస్తారని తెలిసింది. మంగళవారం జరిగే అన్ని రాష్ట్రాల ఐటీ శాఖా మంత్రుల సమావేశంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రంలో ఐటీ రంగ అభివృద్ధికై ప్రభుత్వం రూపొందిస్తున్న అన్ని అంశాలను ఈ సందర్భంగా కేటీఆర్ వివరిస్తారు.