ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ మేనేజ్ మెంట్(ఐఎస్‌బీ), నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రీసర్చ్(నల్సార్), ట్రిపుల్ ఐటీ సంస్థలతో మంగళవారం టూరిజం ప్లాజాలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీ-హబ్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సమావేశంలో ఐటీ శాఖామంత్రి కేటీఆర్, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి హర్‌ప్రీత్‌సింగ్, ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ పీజే నారాయణన్, నల్సార్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ముస్తఫా, ఐఎస్‌బీ డీన్ అజిత్ అరుణాకర్ తదితరులు పాల్గొని ఎంవోయూపై సంతకాలు చేశారు.
దేశంలోనే అతిపెద్దదైన టీ-హబ్ ఇంక్యుబేటర్‌ను ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో 80 వేల చదరపు గజాల్లో ఏర్పాటు చేయనున్నట్లు, వివిధ ఇంజినీరింగ్ కళాశాలల్లో ఎంపిక చేసిన మూడువేల మంది విద్యార్థులకు వచ్చే ఆరునెలల్లో ఇంక్యుబేటర్లో శిక్షణ ఇవ్వనున్నట్లు ఐటీ శాఖామంత్రి కేటీఆర్ తెలిపారు. అంతేకాకుండా వచ్చే రెండేళ్లలో రాష్ట్రప్రభుత్వం మూడులక్షల చదరపు గజాల విస్తీర్ణంలో సొంతగా భవనాన్ని ఏర్పాటు చేసి 1500 మంది ఐటీ కంపెనీలకు శిక్షణ ఇవ్వనున్నట్లు కూడా కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్ లో 4 జీ సేవలను అందించడంతో పాటు, వైఫై నగరంగా తీర్చిదిద్దుతామని, ఐటీఐఆర్ ప్రాజెక్ట్ విస్తరణపై మరింత స్పష్టత రావాల్సి ఉందని, త్వరలోనే కేంద్ర ఐటీ శాఖామంత్రి రవిశంకర్ ప్రసాద్ తో సమావేశమౌతానని మంత్రి పేర్కొన్నారు.