తెలంగాణ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు, ఆసరా పథకం, ఉపాథి హామీ పథకం పనులపై రాష్ట్ర ఐటీ, పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటీఆర్ అమెరికాలోని సిలికాన్ వ్యాలీ నుండి ఇక్కడి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గురువారం రాత్రి అమెరికా కాలమానం ప్రకారం రాత్రి 11 గంటలకు పంచాయితీ రాజ్, ఐటీ అధికారులతో ఈ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్టుపై ప్రవాస భారతీయులు ఆసక్తి చూపుతున్నారని, ఎన్నారైలు సొంత గ్రామాలకు భారీగా విరాళాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుతో తాగునీరు ఇవ్వడంతో పాటు ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ ఇచ్చే ఆలోచన గొప్పగా ఉందని చెప్తున్నారని అన్నారు. తెలంగాణ తాగునీటి ప్రాజెక్టుకు సహకరించేందుకు ప్రవాస భారతీయులు ముందుకొస్తున్నారని, ఎన్నారైల విరాళాల కోసం ప్రత్యేకంగా వెబ్ సైట్ ను ఏర్పాటు చేయాలని పంచాయితీ రాజ్ శాఖ కమిషనర్ అనితా రామచంద్రన్ కు కేటీఆర్ సూచించారు.
నల్లగొండలోని 20 ఫ్లోరైడ్ పీడిత గ్రామాలను దత్తత తీసుకుని అక్కడ ప్రాజెక్టుకయ్యే ఖర్చు భరించేందుకు డల్లాస్ ఎన్నారైలు సంసిద్ధత వ్యక్తం చేసిన విషయాన్ని మంత్రి అధికారులకు వివరించారు. తాగునీటి ప్రాజెక్టు పనులను సమీక్షించిన మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన మూడేళ్ళ గడువులోపే ప్రాజెక్టును పూర్తి చేద్దామని, ఆర్ డబ్ల్యూఎస్ శాఖ ఇప్పటికే తయారు చేసిన డీపీఆర్, కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ తో సాధ్యమైనంత త్వరగా పరిశీలన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా జిల్లా స్థాయిలో ఆసరా పించన్లు, పంచాయితీ రాజ్ రోడ్లు, ఉపాథి హామీ పనులపై సమీక్ష జరిపిన మంత్రి లబ్ధిదారులకు సకాలంలో పించన్లు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల్లో వేగం పెంచాలని, ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని పంచాయితీ రాజ్ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్ ను మంత్రి ఆదేశించారు.