అమెరికా పర్యటనలో ఉన్న ఐటీ, పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటీఆర్ బృందం ఏడవరోజు సిలికాన్ వ్యాలీని సందర్శించింది. అంతర్జాతీయ సంస్థలైన ఒరాకిల్, అడోబ్ లు హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపాయి. అడోబ్ సిస్టమ్స్ సీఈవో శంతను నారాయణ్ ను కలుసుకుని హైదరాబాద్ నగర అభివృద్ధికి, తెలంగాణ రాష్ట్రంలో వ్యాపారాభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను మంత్రి కేటీఆర్ వివరించారు. హైదరాబాద్ లో అడోబ్ కంపెనీ విస్తరణ చేపట్టాలని మంత్రి కోరగా శంతను నారాయణ్ సానుకూలంగా స్పందిస్తూ తమ కంపెనీ విస్తరణ ప్రణాళికల్లో హైదరాబాద్ తప్పనిసరిగా ఉంటుందన్నారు. తాను పక్కా హైదరాబాదీనని, హైదరాబాద్ కోసం ఖచ్చితంగా సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.
కేటీఆర్ బృందం తర్వాత ఒరాకిల్ సీఈవో మార్క్ హడ్ ను కలిసి తెలంగాణ రాష్ట్రంలో ఒరాకిల్ కంపెనీ పెట్టుబడులు పెట్టేందుకు గల అవకాశాలను వివరించారు. అంతేకాకుండా తమ ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన పారిశ్రామిక విధానాన్ని, హైదరాబాద్ నగరంలో సాఫ్ట్ వేర్ సంస్థలకు ఉన్న అవకాశాలను వివరించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను అభినందించిన ఒరాకిల్ కంపెనీ హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపింది. అనంతరం మంత్రి కేటీఆర్ బృందం ప్రఖ్యాత బ్లూమ్ ఎనర్జీ సంస్థ సీఈవో కేఆర్ శ్రీధర్ తో సమావేశమయ్యింది. ఈ సందర్భంగా ఫ్లూయల్ సెల్ సాంకేతిక పరిజ్ఞానం గురించి శ్రీధర్ వివరించారు. అరచేయి విస్తీర్ణంలో ఉన్న ఒక్క ఫ్లూయల్ సెల్ తో ఒక ఇల్లు మొత్తానికి సరిపడా విద్యుత్ ను అందించగలిగే ప్రత్యేకత బ్లూమ్ టెక్నాలజీకి ఉందని చెప్పారు. తెలంగాణలో ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవాలని, తెలంగాణలో మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ను ఏర్పాటు చేయాలని మంత్రి కోరగా, తాను త్వరలోనే హైదరాబాద్ కు వస్తానని, పెట్టుబడులు పెట్టే అవకాశాలను పరిశీలిస్తానని శ్రీధర్ చెప్పారు.
అనంతరం అరుబా నెట్ వర్క్ ను సందర్శించిన మంత్రి బృందం ప్రముఖ వెంచర్ క్యాపిటలిస్టులు కన్వల్ రేఖి, కీర్తి మెల్కోటేలను కలుసుకుని తెలంగాణలో పెట్టుబడులకున్న అవకాశాలను వివరించారు. హైదరాబాద్ లో గూగుల్ సంస్థ తన సొంత క్యాంపస్ ను ఏర్పాటుచేయబోయే అంశానికి సంబంధించి మంత్రి కేటీఆర్ గూగుల్ స్ట్రీట్ వ్యూ ప్రోడక్ట్ మేనేజ్ మెంట్ డైరెక్టర్ మాణిక్ గుప్తా, గ్రౌండ్ ట్రూత్ ఇంజినీరింగ్ హెడ్ నారాయణ తుమ్మలను కలుసుకున్నారు. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ కు ఈ అవకాశం కల్పించడం పట్ల కేటీఆర్ వారికి అభినందనలు తెలిపారు.