జేఎన్టీయూ ఆడిటోరియంలో ఇరిగేషన్ ఇంజినీర్లతో సీఎం కేసీఆర్ సమావేశమై చెరువుల అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యల గురించి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ చెరువులను పునరుద్దరించుకుందామని, తెలంగాణ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇరిగేషన్ కే ఇస్తుందని అన్నారు. సమైక్య రాష్ట్రంలో మైనర్ ఇరిగేషన్ ను పట్టించుకోలేదని, చెరువుల పునరుద్ధరణకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని మండిపడ్డారు.
త్వరలోనే చిన్ననీటి చెరువుల పునరుద్ధరణ వారోత్సవం పెట్టుకుందామని, ప్రతి చెరువు మరమ్మత్తుకు సుమారు రూ. 50 లక్షల వరకు ఖర్చు అవుతుందని అంచనా అని, ఏడాదికి 9,060 చెరువుల చొప్పున పునరుద్ధరించుకుంటూ పోతే ఐదేళ్ళలో మొత్తం 45, 300 చెరువులు బాగు పడతాయని చెప్పారు. రాబోయే నాలుగైదేళ్ళలో ఇరిగేషన్ శాఖకు రూ. 50 వేల కోట్ల నుండి రూ. 70 వేల కోట్ల వరకు ఖర్చు చేస్తామని పేర్కొన్నారు. తెలంగాణలో ఉన్న చెరువుల్ని కాకతీయ రెడ్డి రాజులు తవ్వించినవేనని, వాటర్ షెడ్ అంటే ఏమిటో 11 వ శతాబ్దంలోనే కాకతీయులు చేసి చూపించారని గుర్తు చేశారు.
చెరువుల వైభవం ప్రజలకు తెలియజేసేలా కార్యక్రమాలు రూపొందిస్తామని, కళాబృందాలతో చెరువుల పరిరక్షణకై వారోత్సవాలు నిర్వహిద్దామని అన్నారు. చెరువుల పరిరక్షణ కోసం తానూ ఓ పాట రాస్తానని, తట్ట మోస్తానని, మంత్రులు, కలెక్టర్లు కూడా తట్ట మోస్తారని చెప్పారు. హరితహారం కార్యక్రమంలో అధికారులు కూడా భాగస్వాములు కావాలని, రాబోయే మూడేళ్ళలో 230 కోట్ల మొక్కలు నాటుతామని సీఎం పేర్కొన్నారు.