బుధవారం జలసౌధలో భారీ నీటి పారుదల శాఖ మంత్రి టీ హరీష్ రావు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఉదయం 10 గంటలకు వచ్చిన మంత్రి 11. 30గంటల వరకూ అక్కడే ఉండి కార్యాలయ పనితీరును గమనించారు. జలసౌధలోని అన్ని కార్యాలయాల్లో తిరుగుతూ ఉద్యోగులు, అధికారులు సకాలంలో విధులకు హాజరవుతున్నారా?లేదా? ఫైళ్ళ పరిస్థితి ఏ స్థాయిలో ఉంది? పరిసరాల పరిశుభ్రత ఎలావుంది? అనే అంశాలను పరిశీలించారు.
బయోమెట్రిక్ విధానం వచ్చినప్పటికీ ఉద్యోగులు సమయపాలన పాటించకుండా ఉద్యోగులు, అధికారులు 20 శాతం మంది ఉదయం 11.30గంటలకు కూడా రాకుండా ఉండటాన్ని మంత్రి హరీష్ రావు గమనించి అసహనం వ్యక్తం చేశారు. మంత్రి తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఇటీవలే పదవీవిరమణ చేసిన ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఒకరు తనకు పెన్షన్ రావడంలేదని, అధికారులు తిప్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేయగా, వెంటనే స్పందించిన మంత్రి సదరు ఉద్యోగి పెన్షన్ వెంటనే మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని అక్కడే ఉన్న నీటిపారుదల శాఖ పరిపాలనా విభాగం ఇంజినీర్ ఇన్ చీఫ్ నారాయణరెడ్డిని ఆదేశించారు.
పలు విభాగాల్లో ఫైళ్ళు గుట్టలు గుట్టలుగా పడిఉండటాన్ని గమనించిన హరీష్ రావు ఫైళ్ళ పెండింగ్ అనే సమస్య లేకుండా చూడాలని సూచించారు. జలసౌధలో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ కు చెందిన కార్యాలయాలు కేటాయించడం వల్ల స్థల సమస్య ఏర్పడిందని అధికారులు మంత్రికి వివరించారు. కొన్ని టేబుళ్లు అపరిశుభ్రంగా ఉండటం చూసి ఎవరో వచ్చి చేయాలని చూడకుండా ఎవరి టేబుల్ వాళ్ళు శుభ్రం చేసుకోవచ్చు కదా అని ఉద్యోగులను ప్రశ్నించారు.
ఈ సందర్భంగా ఉద్యోగుల, అధికారుల సమస్యలను మంత్రి హరీష్ రావు అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగులు, అధికారులు సమన్వయంతో, అంకితభావంతో పనిచేసి ప్రభుత్వ పథకాలు ప్రజల దరికి చేర్చడానికి ప్రయత్నించాలని, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంపై దృష్టి సారించాలని హరీష్ రావు చెప్పారు. ప్రభుత్వం మంచిగా పనిచేసే వారిని ప్రోత్సహిస్తుందని, అదే సమయంలో నిర్లక్ష్యాన్ని చూస్తూ సహించేదిలేదని తేల్చిచెప్పారు.