మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని ముప్పిరెడ్డిపల్లిలో శాంతా బయోటెక్ చేపడుతున్న ఇన్సులిన్ పరిశ్రమకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఈరోజు శంకుస్థాపన చేశారు. సుమారు 460 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఈ పరిశ్రమ పూర్తిగా ఫ్రెంచ్ సాంకేతిక పరిజ్ఞానంతో ఉండనుంది. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ తో పాటు డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, మంత్రులు హరీష్ రావు, జూపల్లి కృష్ణారావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, ప్రపంచంలోని అతికొద్దిమంది ఆదర్శప్రాయుల్లో డా. వరప్రసాద్ రెడ్డి ఒకరని, అత్యంత పట్టుదలతో శాంతా బయోటెక్ ను ప్రారంభించారన్నారు. వరప్రసాద్ రెడ్డి ఇప్పటివరకు 170కి పైగా అవార్డులు స్వీకరించారని, ఎటువంటి లాభాపేక్ష లేకుండా పరిశ్రమలు నడపడం ఆయన నిబద్ధతకు నిదర్శనమని ప్రశంసించారు.
శాంతా వాక్సిన్ తయారుచేసి కలరాను తరిమికొట్టిన ఘనుడు వరప్రసాద్ రెడ్డి అని, ఇలాంటి వ్యక్తులు దొరికితే బంగారు తెలంగాణ కాదు.. వజ్రాల తెలంగాణ నిర్మిస్తామని కేసీఆర్ అన్నారు. వరప్రసాద్ రెడ్డి సమాజం కోసం పుట్టారని, 850 రూపాయలు ఉన్న డయాబెటిస్ ఇన్సులిన్ ను కేవలం 150 రూపాయలకే అందుబాటులోకి తెస్తామని చెప్పడం ఎంతో అభినందనీయమని సీఎం పేర్కొన్నారు. తెలంగాణలో బెస్ట్ ఇండస్ట్రియల్ పాలసీని తీసుకొస్తామని, అవినీతికి తావులేకుండా నూతన పారిశ్రామిక విధానం తీసుకొచ్చామని, పరిశ్రమల ఏర్పాటుకు కావాల్సిన అప్లికేషన్లు వెబ్ సైట్ లో పెడతామని సీఎం చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడిదారులకు అండగా ఉంటుందని, పారిశ్రామికవేత్తలు ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని లేదని, పారిశ్రామికవేత్తలతో తామే చర్చించి పదిహేను రోజుల్లో అనుమతులు ఇప్పిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు.