ఈ నెల 30 వ తేదీన ‘చలో హైదరాబాద్’ కోసం అన్ని జిల్లాల నుంచి లక్షలాది మంది సమాయత్తమవుతున్నారు. అయితే హైదరాబాద్ మార్చ్‌కు తరలి వచ్చే ఉద్యమకారులు కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలె.
1. తెలంగాణ మార్చ్ చట్టవ్యతిరేకమైనది కాదు. ప్రజలు తమ ఆకాంక్షలు తెలియచెప్పడం కోసం ఒక చోట సమావేశం కావడం లేదా ప్రదర్శన జరపడం రాజ్యాంగ హక్కు. తెలంగాణ మార్చ్ ప్రజాస్వామ్య బద్దమైనది.
2. ఉద్యమకారులు కొద్ది రోజుల పాటు చెడి పోకుండా నిలువ ఉండే అటుకులు ప్యాలాల వంటి ఆహార పదార్థాలు వెంట తెచ్చుకోవాలె. రొట్టెలు కూడాతెచ్చుకోవచ్చు. మొదటి రోజు కోసం అన్నం కూడా తెచ్చు కోవచ్చు. వెంట రెండు నీళ్ళ సీసాలు తెచ్చుకోవాలె. మార్చ్‌లో పాల్గొనే వారి కోసం జేఏసీ ఆహారం, నీళ్ళ పొట్లాలు సరఫరా చేస్తుంది. జేఏసీ సరఫరా పొట్లాలపైనే ఆధారపడి తమ వద్ద పొట్లాలను అత్యవసరం ఏర్పడితే ఉపయోగించుకోవాలె.
3. మార్చ్‌కు వచ్చేవారు కర్రలు తీసుకుని రాకూడదు. జెండాలు పట్టుకుని రావచ్చు.
4. ఒక జత బట్టలు తెచ్చుకోవడం మంచిది. దుప్పటి కూడా తెచ్చుకోవాలె.
5. గుంపుగా వచ్చే వారు అదే గుంపుతో కలిసి ఉండడానికి ప్రయత్నించాలె. తోటి వారికి చెప్పకుండా వెళ్లిపోకూడదు.
6. మార్చ్‌కు వచ్చే ఉద్యమకారులు ఏదైనా కారణాల వల్ల గాయపడితే తెలంగాణ డాక్టర్లు చికిత్స చేయడానికి సిద్ధంగా ఉంటారు. పోలీసులు అరెస్టు చేసిన వారిని విడిపించడానికి న్యాయవాదులు కూడా సిద్ధంగా ఉంటారు. మార్చ్‌కు వచ్చే వారు జేఏసీ ప్రకటించిన డాక్టర్లు, లాయర్ల నెంబర్లను దగ్గర పెట్టుకుంటే మంచిది.
7. మార్చ్‌కు తరలివచ్చేవారు సొంత వాహనాలలో వస్తుంటే పోలీసులు వెనుకకు పంపవచ్చు. అందువల్ల బస్సులలో, రైళ్ళలో అనుమానం రాకుండా హైదరాబాద్‌కు చేరుకోవాలె. హైదరాబాద్‌లో బంధు మిత్రులు ఉంటే, కొద్ది రోజుల ముందే చేరుకోవడం మంచిది.
. అనారోగ్యంతో ఉన్న వారు మార్చ్‌కు రాకూడదు.
9. హైదరాబాద్‌కు వచ్చే వారిని పోలీసులు ఎక్కడ అడ్డుకుంటే అక్కడే ధర్నాలు చేయడం ద్వారా తమ నిరసనను ప్రకటించాలె.
10. పోరాటం ద్వారానే తెలంగాణ సాధిస్తాం. ఇవాళ కాకుంటే రేపు తెలంగాణ రాష్ట్రం తప్పక ఏర్పడతది. నిరాశ పడి బలిదానాలకు పాల్పడవద్దు. బతికి తెలంగాణ సేవ చేయడమే ఈ జీవితానికి సార్థకత.