రాష్ట్ర పర్యటనకు విచ్చేసిన కేంద్ర వ్యవసాయ శాఖ సహాయమంత్రి శోభ కరంద్లాజే గారికి తెలంగాణకు వ్యవసాయ నిధులు పదిరెట్లు పెంచాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వినతిపత్రం అందజేశారు. తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు, రైతుభీమా వంటి వినూత్న పథకాల ద్వారా ఇప్పటి వరకు రూ.50 వేల కోట్లు రైతుల భద్రత, వ్యవసాయ పెట్టుబడుల కోసం ఖర్చు చేయగా.. వ్యవసాయ అనుబంధ రంగాలకు కేంద్రం ఇప్పటివరకు కేవలం రూ.800కోట్లు మాత్రమే తెలంగాణకు కేటాయించిందన్నారు. దేశంలోని భూవిస్తీర్ణంలో తెలంగాణ వాటా 3.4 శాతం మాత్రమే అయినప్పటికీ దేశంలోని మొత్తం పంటల సాగు విస్తీర్ణంలో తెలంగాణ వాటా 4.65 శాతంగా ఉంది. అలాగే జాతీయస్థాయిలో వివిధ ధాన్యాల ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్ర వాటా 9.9 శాతం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందే సాగునీటి ప్రాధాన్యతను గుర్తించి, రాష్ట్రం ఏర్పడిన వెంటనే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి, నూతన ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టి సాగునీటి అందుబాటులోకి తీసుకురావడం జరుగుతోందని, సాగునీటి రంగం మీద పెట్టిన పెట్టుబడులు మంచి ఫలితాలిస్తున్నాయని తెలిపారు. రాష్ట్రమంతటా భూగర్భజలాలు పెరగడంతో పాటు రాష్ట్రంలోని ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు నిండుగా ఉన్నాయన్నారు. దేశంలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటును సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అన్న మంత్రి, వ్యవసాయం మీద రైతులకు భరోసా కల్పించేలా, వారి ఆదాయం పెంచడానికి సమయానికి విత్తనాలు, ఎరువులు అందిస్తూ, ధాన్యం కొనుగోలు చేయడమే కాకుండా ప్రతి ఐదు వేల ఎకరాలకు ఒక క్లస్టర్ ను ఏర్పాటు చేసి రైతు వేదికలు నిర్మించి వ్యవసాయ విస్తరణ అధికారులను నియమించడం జరిగిందన్నారు. తెలంగాణ వ్యవసాయ అనుకూల విధానాలతో వ్యవసాయరంగంలో సాధించిన విజయాలను పరిగణనలోకి తీసుకుని తెలంగాణ రాష్ట్రాన్ని ప్రత్యేకంగా పరిగణిస్తూ ప్రస్తుతం అందిస్తున్న దానికి పదిరెట్లు ఎక్కువ నిధులను కేటాయించాలని మంత్రి నిరంజన్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రి నిరంజన్ రెడ్డి తో పాటు రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, వ్యవసాయ శాఖ ప్రత్యేక కమీషనర్ హన్మంతు కొండిబ పాల్గొన్నారు.