mt_logo

ఇక కొత్త రుణాలు

-ప్రభుత్వ సూచనకు బ్యాంకర్ల అంగీకారం..
-వేగంగా తొలివిడత ప్రక్రియ పూర్తికి ఆదేశాలు
-బ్యాంకర్లతో మరోవిడత ఉపసంఘం భేటీ
– ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం
– ప్రతి రైతు ఖాతాలో 25% రుణమాఫీ సొమ్ము
– ఖరీఫ్ రుణాలు ఇప్పించేందుకు చర్యలు
– యూరియా కొరత కృత్రిమ సృష్టే
– బ్యాంకర్లతో భేటీ అనంతరం మంత్రి పోచారం
– రూ.4250 కోట్లు విడుదల రికార్డని వ్యాఖ్య
– ఎమ్మెస్పీ ప్రకారం ధాన్యం కొనుగోళ్లు
– రైతులు ఆందోళన పడొద్దన్న మంత్రి ఈటెల

రుణమాఫీ కోసం ప్రభుత్వం తొలివిడత కింద రూ. 4,250 కోట్లు విడుదల చేసినందున బ్యాంకర్లు రైతులకు సత్వరమే ఖరీఫ్ సీజన్‌కు కొత్త పంటరుణాలు ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తంచేశారని వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. ప్రభుత్వం విడుదలచేసిన డబ్బు ను బ్యాంకర్లకు వ్యవసాయ శాఖ అందజేసిందని తెలిపారు. లక్ష రూపాయల రుణ మాఫీకి సంబంధించి ప్రతి రైతు ఖాతాలో 25శాతం డబ్బులు జమ అవుతాయని తెలిపారు. తొలి విడత కింద విడుదల చేసిన ఈ నిధులకుతోడు బ్యాంకర్లు కూడా 25నుంచి 30శాతం వరకు కలిపి రైతులకు తక్షణమే రెన్యూవల్ చేసేందుకు అంగీకరించారని చెప్పారు. సెప్టెంబర్ నెలాఖరు పంటల బీమా తుది గడువుగనుక ఆలోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాలని బ్యాంకర్లను కోరినట్లు మంత్రి తెలిపారు. ఏ మాత్రం ఆలస్యంచేయకుండా బ్యాంకర్లు కొత్త రుణాలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

మంత్రివర్గ ఉపసంఘం, బ్యాంకర్లు, ఉన్నతాధికారుల సమావేశం మంగళవారం సచివాలయంలో జరిగింది. ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ మంత్రి టీ హరీశ్‌రావు, అటవీ శాఖ మంత్రి జోగు రామన్న, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి వీ నాగిరెడ్డి, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య, ఎస్‌బీఐ సీఎం జస్వంత్‌సింగ్, జీఎం జీకే కన్సాల్ పాల్గొన్నారు. సమావేశం అనంతరం మంత్రి పోచారం మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా ఇచ్చినమాట ప్రకారం రుణమాఫీ అమలుచేసి చూపామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.17వేల కోట్లు రుణమాఫీ చేశామని, దీంతో 36లక్షల మందికి రైతులకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు.

బ్యాంకర్లకు తొలి విడతకింద రూ.4250కోట్లు విడుదల చేశామని, ఆ మేరకు 532, 115, 116 జీవోలు జారీ చేశామని చెప్పారు. రుణమాఫీ పథకాన్ని పకడ్బందీగా అమలుచేసే విధంగా, ఎలాంటి అవినీతి చోటు చేసుకోకుండా ఉండేందుకు రాష్ట్ర స్థాయి, జిల్లాస్థాయి, మండల స్థాయిల్లో ఫిర్యాదుల విభాగం ఏర్పాటు చేశామని చెప్పారు. సెప్టెంబర్ నెలాఖరు దాటితే అపరాధ వడ్డీ చెల్లించాల్సి వస్తుంది గనుక దీన్ని రైతులు గ్రహించాలని, బ్యాంకర్లు కూడా గమనంలో పెట్టుకొని సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తొలివిడత రుణమాఫీ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని కోరారు. సిబ్బంది కొరత ఎదురైతే రెవెన్యూ, వ్యవసాయశాఖ ఉద్యోగులను ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా మంత్రి అధికారులకు సూచించారు.

రైతులు ఆందోళన, ఆవేదనకు గురి కాకుండా బ్యాంకులు ఒక పద్ధతిలో గ్రామాలను ఎంపిక చేసుకొని ఆయా తేదీల్లో రైతులను పిలిపించుకొని క్రమంగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని కోరారు. చిన్న చిన్న సమస్యలు తలెత్తితే అక్కడిక్కడే పరిష్కారం అయ్యే విధంగా అధికారులు చొరవ చూపాలని కోరారు. రుణమాఫీ విషయంలో బుద్ధిలేని ప్రతిపక్ష పార్టీల నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని పోచారం ధ్వజమెత్తారు. వారికి రైతులపక్షాన పనిచేయడం తెలియదని, చేసే వారికి సహకరించేది కూడా తెలియదని మండిపడ్డారు. 9జిల్లాల్లోని రైతాంగానికి ఈ రుణమాఫీ వర్తిస్తుందని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు. కరువు మండలాల్లోని రైతులకు కూడా వర్తిస్తుందని స్పష్టంచేశారు.

ఈ నెలాఖరు నుంచి ఖరీఫ్ సీజన్ ధాన్యం మార్కెట్‌కు వస్తుంది గనుక మార్కెట్ యార్డుల్లో టార్పాలిన్లు, శుభ్రపర్చే యంత్రాలు, తూకం వేసే పరికరాలు, మౌలిక వసతులు మెరుగుపర్చామని చెప్పారు. కావాల్సిన నిధులు కూడా విడుదల చేశామని తెలిపారు. ధాన్యానికి ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ)కే కొనుగోళ్లు జరుగుతాయని, రైతులు ఆందోళన చెందవద్దని అన్నారు. రెండు వేల ఐకేపీ కేంద్రాలున్నాయని, వీటికితోడు మార్కెఫెడ్‌కూడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నదని తెలిపారు. బ్యాంకర్ల సమావేశానికి ముందు మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావును సచివాలయంలో కలిశారు. ప్రభుత్వం రుణాలమాఫీపై అధికారిక ప్రకటనచేసిన తర్వాత బ్యాంకులకు చెల్లించాల్సిన మొత్తంపై చర్చించేందుకు మంత్రులు సీఎంతో సమావేశం అయ్యారు.

సీఎంకు పలువురి కృతజ్ఞతలు
రైతుల రుణమాఫీకి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సీఎం కే చంద్రశేఖర్‌రావును కలిసి కృతజ్ఞతలు, అభినందనలు తెలిపారు. సచివాలయంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఈటెల రాజేందర్, హరీశ్‌రావు, కేటీ రామారావు, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, ఎంపీలు కే కేశవరావు, కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు జలగం వెంకట్రావ్, రామలింగారెడ్డి, జీవన్‌రెడ్డి సీఎంను కలిసినవారిలో ఉన్నారు.

రుణమాఫీ అమలులోకి రావడంతో రైతులంతా సంతోషంగా ఉన్నారని వారు సీఎంకు చెప్పారు. మానిఫెస్టోలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వారితో అన్నారు. రుణమాఫీ విషయంలో బ్యాంకర్లతో మాట్లాడి, విధి విధానాలను రూపొందించిన మంత్రివర్గ ఉపసంఘాన్ని సీఎం అభినందించారు.
ఒక్క జీవోతో 4250 కోట్ల విడుదల రికార్డు: సీఎంను కలిసే ముందు విలేకరులతో మాట్లాడిన పోచారం.. రుణమాఫీ చేయడంతోపాటు నిధులు విడుదలకు ఉత్తర్వులు జారీ చేయడంపట్ల తెలంగాణవ్యాప్తంగా రైతులు సంబురాలు జరుపుకుంటున్నారని అన్నారు.

దేశ చరిత్రలో ఒక్క జీవోతో 4,250 కోట్ల రూపాయలను విడుదల చేసిన ఘనత కేసీఆర్‌కు దక్కుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. నిధులు విడుదల చేసినందుకు సీఎంకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. చాలామంది రైతులు ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలుపాలని భావిస్తున్నారని చెప్పారు. నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాలో కొంతమంది వ్యాపారస్తులు కృత్రిమ ఎరువుల కొరత సృష్టిస్తున్నారని అన్నారు. యూరియా విషయంలో రైతులు ఆందోళన చెందవద్దని, కేంద్రానికి అదనపు యూరియా కావాలని లేఖ రాశామని తెలిపారు. కృత్రిమ ఎరువుల కొరత సృష్టిస్తున్న వారిపై నిఘా ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *