mt_logo

ఐఐపీహెచ్ రెండవ క్యాంపస్ కు భూమిపూజ చేసిన సీఎం..

పబ్లిక్ హెల్త్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సుమారు 60 కోట్ల రూపాయలతో రాజేంద్రనగర్ లో ఏర్పాటు చేయబోయే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్(ఐఐపీహెచ్) కు మంగళవారం సీఎం కేసీఆర్ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, కొత్తగా ఆలోచించి కొత్త బాటలో పయనించాలని, మనకు చాలా తెలిసినా, అంతకంటే ఎక్కువ తెలుసుకోవాలని, మొత్తం మన ప్రాధమిక ఆలోచనలోనే మార్పు రావాలని అన్నారు. మార్పు తప్పకుండా వస్తుందని, ఏదీ శాశ్వతం కాదని, అది సైకిల్ చక్రం లాంటిదని, కాలచక్రం తిరిగి వస్తుందని, ఆ విషయంలో తానూ చాలా ఆశావాదిగా ఉంటానని సీఎం అన్నారు. తెలంగాణ రాష్ట్రం వందశాతం అభివృద్ధి సాధించి తీరుతుందని, దేశంలోని బెస్ట్ ఇన్స్టిట్యూషన్ గా తెలంగాణ ఎదుగుతుందని సీఎం స్పష్టం చేశారు.

ఐఐపీహెచ్ రెండో క్యాంపస్ ను హైదరాబాద్ లో శంకుస్థాపన చేయడం ఎంతో సంతోషంగా ఉందని,సమాజ పురోగతికి, మెరుగైన ఆరోగ్యానికి ఈ సంస్థ సేవలు ఉపయోగపడతాయని కేసీఆర్ అన్నారు. క్యాంపస్ నిర్మాణానికి అయ్యే ఖర్చులో సగం నిధులు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తే బాగుంటుందని వచ్చిన విజ్ఞప్తులపై సీఎం స్పందిస్తూ, దీనిపై సాధ్యమైనంత త్వరలో పీహెచ్ఎఫ్ఐ అధ్యక్షుడు ప్రొఫెసర్ కే శ్రీనాథ్ రెడ్డి, ఇతర మిత్రులతో సమావేశమై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఆర్ధిక, పరిపాలనాపరంగా వందశాతం సహకారం అందిస్తామని, ముందుగా 10 కోట్ల రూపాయలను విడుదల చేస్తామని సీఎం ప్రకటించారు. మేధావులు సమాజాన్ని జాగృతం చేయాల్సిన అవసరం ఉందని, ఎప్పుడు సమకాలీన సమాజం, చరిత్ర చూసినా ఆనాటి అందుబాటులో ఉన్న మేధావులు సమాజానికి కరదీపికగా ఉన్నారన్నారు. ఇప్పుడు కూడా అదే పాత్ర పోషించాలని, ఆ దిశగా పోతేనే తెలంగాణ రాష్ట్రం 100 శాతం బాగుపడుతుందని కేసీఆర్ చెప్పారు.

అనంతరం శ్రీనాథ్ రెడ్డి మాట్లాడుతూ ఎంతో రాజకీయ చైతన్యంతో ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ వైద్య వ్యవస్థలో నూతన ఇన్నోవేషన్ తెస్తారనే నమ్మకం ఉందని, 2016 జూన్ 2 కల్లా ఈ భవనం మొదటి ఫేజ్ పూర్తిచేసి తెలంగాణ తల్లికి పూజాపుష్పంగా సమర్పిస్తామని చెప్పారు. ఇన్ఫోసిస్ చైర్మన్ నారాయణమూర్తి మాట్లాడుతూ, ఈ సంస్థ తెలంగాణ ప్రజలకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందించేందుకు ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు కేకే, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మంత్రి మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *