– ఇప్పుడే మొదలుబెట్టినం
– సర్వేతో సమాచారమంతా తీసుకున్నం
– దసరా నుంచి పేదలకు సంక్షేమ పథకాలు
– మూడేండ్లు కరెంటు కష్టాలు తప్పవు
– వాటర్‌గ్రిడ్‌తో ఇంటింటికీ రక్షిత మంచినీరు
– కాళోజీ కళాకేంద్రం భూమి పూజ కార్యక్రమంలో సీఎం
వంద రోజుల్లో ఇంత జేసిండ్రు.. అంత జేసిండ్రు అని అంటున్నరు. వంద రోజుల్లో చేసింది ఏం లేదు. ఇప్పుడే మొదలుపెట్టినం. సకల జనుల సర్వేతో కావాల్సిన సమాచారం అంతా తీసుకున్నం. మైలపోలు ముందు ముందు ఎల్లుతది. ఇప్పుడే ఏం అయింది? అని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వంపై టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల చేస్తున్న విమర్శలను కేసీఆర్ తిప్పికొడుతూ అసలు పనే మొదలు కాలేదు.
ఇప్పుడే మైలపోలు తీస్తున్నం. అభివృద్ధి కార్యక్రమాలను రూపొందిస్తున్నాం అని చెప్పారు. ప్రఖ్యాత కవి, తెలంగాణ వైతాళికుడు కాళోజీ నారాయణరావు శతజయంతి సందర్భంగా మంగళవారం వరంగల్‌లో కాళోజీ కళాకేంద్రానికి శంకుస్థాపన చేసిన అనంతరం నిట్ ఆడిటోరియంలో ఏర్పాటుచేసిన సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. కాళోజీ కవిత్వం సార్వజనీనం. ఆయన ఒక్క వరంగల్‌కో, తెలంగాణకో, దేశానికో పరిమితమయ్యే వ్యక్తికాదు యావత్ ప్రపంచ మానవుడు. విశ్వకవి అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కొనియాడారు. ఆయన జన్మదినాన్ని తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రతియేటా జరుపుతామని, ఒక వర్సిటీకి కాళోజీ పేరు పెడుతామని ప్రకటించారు. కాళోజీ రచనలను ఇతర భాషల్లోకి అనువదించి.. ఆయన ఖ్యాతిని ప్రపంచస్థాయికి తీసుకుపోతామని చెప్పారు.
దసరా నుంచి సంక్షేమ కార్యక్రమాలు
ఈ ఐదేండ్ల కాలంలో తెలంగాణలో భూమిలేని నిరుపేద దళితులకు సంబంధించిన లక్ష కుటుంబాలను భూస్వాములను చేసే బృహత్తర కార్యక్రమాన్ని తీసుకున్నాం.
-కాళోజీ విశ్వకవి..
-కళాకేంద్రానికి రూ.12 కోట్లు మంజూరు
-కాళోజీ కుటుంబీకులకు పది లక్షల డిపాజిట్
-తెలంగాణ భాషాదినోత్సవంగా కాళోజీ జయంతి
-రవీంద్రభారతిని తలదన్నేలా కాళోజీ కళాకేంద్రం
-ఒక యూనివర్సిటీకి ఆయన పేరు పెడుతాం
-కాళోజీ రచనలను ఇతర భాషల్లోకి అనువదిస్తాం
-ప్రతి సంవత్సరం కాళోజీ పేర పురస్కారాలు
-స్టాంపు విడుదల కోసం క్యాబినెట్‌లో తీర్మానిస్తాం
వారికి మూడు ఎకరాల భూమి, ఏడాది పెట్టుబడి ఇచ్చి లక్షాధికారులను చేయాలనుకుంటున్నాం. పొన్నాల లక్ష్మయ్యా.. నీ జన్మల దళితులకు భూమి కావాలని అడిగినవా? నువు ఎన్నడైనా కల్యాణలక్ష్మిలాంటి పథకాల గురించి కనీసం ఆలోచించినవా? అంటూ కేసీఆర్ నిప్పులు చెరిగారు.
దళిత, గిరిజన, మైనార్టీ యువతుల వివాహానికి రూ.51వేల ఆర్థిక సహాయాన్ని అందించేలా కల్యాణలక్ష్మి కార్యక్రమాన్ని తీసుకున్నామన్నారు. డంబాచారం, గోల్‌మాల్ వద్దు. ఉన్న వాస్తవాలను ప్రజలకు వివరిద్దాం. దసరానుంచి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయబోతున్నాం అని చెప్పారు.
టీఆర్‌ఎస్ నాయకులు కూడా ఇతర రాజకీయ పార్టీల నాయకులు చేస్తున్న ప్రకటనలు చూసి తత్తరపడి, బిత్తరపడి మాట్లాడవద్దని సూచించారు. చేసేదే చెప్పాలి. చెప్పింది చేయాలి అని ఉద్బోధించారు. డిప్యూటీ సీఎం రాజయ్య వరంగల్‌లో హెల్త్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారని చెప్తూ.. అది సాధ్యం అవుతుందా? సాధ్యంకాని ప్రకటనలు చేయవద్దు అంటూ రాజయ్యను ఉద్దేశించి అన్నారు.
నాలుగేండ్లలో తెలంగాణ వాటర్ గ్రిడ్
వాటర్‌గ్రిడ్ ఏర్పాటుద్వారా నాలుగేండ్లలో తెలంగాణలోని అన్ని గ్రామాల్లోని ఇండ్లకు నల్లా కనెక్షన్ ద్వారా రక్షిత మంచినీరు అందిస్తామని సీఎం తెలిపారు. తెలంగాణ ప్రజలకు ముందుగా తాగునీరు అందించాలి. గతంలోనే సిద్దిపేటలో 145 గ్రామాలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించే ఏర్పాటు చేశాం. తెలంగాణలో ప్రతి మారుమూల లంబాడ తండా, గోండు గూడెం, గంగిరెద్దులవాళ్ల ఇండ్లకు నల్లాద్వారా తాగునీరు అందించే విధంగా తెలంగాణ వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేస్తున్నాం. రాబోయే రోజుల్లో తెలంగాణలోని ప్రతి ఇంట్లో కుండలో మంచినీళ్లు ఉండేలా చేస్తాం అన్నారు.
కరెంటు కష్టాలపై రైతులకు అవగాహన ఉంది
విపక్షాలు కరెంటు సమస్యపై లేనిపోని రాద్ధాంతం చేస్తున్నాయని సీఎం మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో తాను 107 సభల్లో పాల్గొనగా 86 చోట్ల తెలంగాణ వచ్చినా మూడేండ్లపాటు కరెంటు కష్టాలు తప్పవని చెప్పిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. మొదటి ఏడాది సమస్య ఎక్కువగా ఉంటుంది. రెండో సంవత్సరం కొంత అధిగమించవచ్చు.
మూడో సంవత్సరం పూర్తిగా బయటపడతాం. మూడేండ్ల తరువాత రైతులకు 24 గంటలు కనురెప్పపాటు అంతరాయం లేకుండా కరెంటిస్తాం అని హామీ ఇచ్చారు. అప్పటి వరకు ఇబ్బందులు తప్పవని, ఈ విషయం తెలంగాణ రైతాంగానికీ తెలుసునని చెప్పారు. దళితవాడల నుంచి దరిద్రాన్ని తరిమికొట్టేంతవరకు నిద్రపోనని కేసీఆర్ అన్నారు. అందరూ సంతోషంగా ఉండే బంగారు తెలంగాణ రూపుదిద్దుతామని చెప్పారు.
కాళోజీ ప్రతీమాట సార్వజనీనం
కాళోజీ కలంనుంచి జాలువారిన ప్రతీ మాట, ప్రతీ కవిత సార్వజనీనమైనదని, విశ్వజనీనమైనదని కేసీఆర్ కొనియాడారు. సమాజాన్ని ప్రభావితం చేసిన విశ్వమానవుడు కాళోజీ. ఆయన విశ్వకవి అని కీర్తించారు. కాళోజీ ఆలోచనలు సమాజానికి మార్గదర్శకంగా నిలిచాయి. కాళోజీ ఒక ఉన్నతమైన శిఖరం అని నివాళులర్పించారు.
ఆయన ఎప్పుడూ ఎక్కడా రాజీపడలేదని, రాజీపడే మనస్తత్వం కాదని, ఇలాంటివి వరంగల్ జిల్లాలోనే ఉంటాయని కేసీఆర్ అన్నారు. కాళోజీలాంటివారే ఇక్కడ మరొకరు ఉన్నారని, ఆయన ప్రొఫెసర్ జయశంకరని చెప్పారు. కాళోజీకి చంద్రుడికో నూలుపోగులా చేతనైనంత మేర చేస్తామన్న సీఎం.. ఆయన పేరిట పలు కార్యక్రమాలను ప్రకటించారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిని తలదన్నేవిధంగా వరంగల్‌లో మూడున్నర ఎకరాల స్థలంలో కళాకేంద్రం ఏర్పాటుకు భూమి పూజ చేశామని, మరో ఆరేడునెలల్లో తానే వచ్చి ఆ కళాకేంద్రాన్ని ప్రారంభిస్తానని అన్నారు. ఆ మహనీయుడి స్ఫూర్తితో అగ్గిపిడుగుల్లా ముందుకు వెళ్తాం. తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని, ధిక్కారాన్ని పుణికిపుచ్చుకొని బాజాప్తా ముందుకు పోతం అని ప్రకటించారు.
కాళోజీ రచనలను అనువదిస్తాం
నా గొడవ.. అనేది కాళోజీ గొడవకాదు, అది ప్రజల గొడవ. ఆయన ఆలోచనలను సమాజం ముందుపెడుతారు. కాళోజీ రాసిన ప్రతీ కవిత విశ్వవికాసానికి ఉపయోగపడుతుంది. అందుకే కాళోజీ రచనలను జాతీయభాషల్లోకి అనువదించి, అంతర్జాతీయ స్థాయికి తీసుకపోతాం. ఎంతో విలువైన రచనలను ఇతర భాషల్లోకి అనువదించినప్పుడే ఆయన ఖ్యాతి అంతర్జాతీయ స్థాయికి తెలుస్తుంది అన్నారు. త్వరలోనే ఈ కార్యక్రమాన్ని చేపడుతామని చెప్పారు. ముక్కుసూటిగా, ఉన్నదున్నట్టు ముక్కుమీద గుద్దినట్టు చెప్పే మనస్తత్వం కాళోజీకే సొంతమని, ప్రొఫెసర్ జయశంకర్‌లాంటివాళ్లు కూడా కాళోజీని అత్యంత గౌరవంగా స్వీకరించారని గుర్తుచేశారు.
జయశంకర్ ఒక సభలో మాట్లాడిన ఉపన్యాసాన్ని జర్నలిస్టు మల్లేపల్లి లక్ష్మయ్య తెలంగాణలో ఏం జరుగుతోంది అనే పేరుతో పుస్తకాన్ని ముద్రించారు. ఆ పుస్తకావిష్కరణ సభకు కాళోజీని పిలిచారు. తెలంగాణోళ్లు ఏం జరుగుతోంది అనరు, ఏం జరుగుతాంది అంటరు. ఇదే విషయాన్ని కాళోజీ వేదికపైనే ఉన్న జయశంకర్‌తో పరోక్షంగా ఏం జయశంకర్.. తెలంగాణల ఏం జరుగుతాంది? అని అడిగిండు. ఆ ప్రశ్నకు జయశంకర్ గమ్మునున్నాడు. ఆ శీర్షిక నేను పెట్టలేదని చెప్పుతే అయితే పుస్తకంకూడా నువ్వు రాయలేదా? అని కాళోజీ అడుగుతాడేమోనని భయపడ్డడు.ఈ విషయం నాతో జయశంకర్‌సారు చెప్పారు. అలాంటి ముక్కుసూటితత్వం ఉన్న వ్యక్తి కాళోజీ అని చెప్పారు.
కొసదాక కొట్లాడమన్నడు
నేను టీఆర్‌ఎస్ స్థాపించకముందు కాళోజీని కలిసి ఆశీర్వచనం తీసుకున్నప్పుడు మంచిగనే మొదలుపెట్టినవు గని కొసదాకా కొట్లాడు అని ప్రోత్సహించారు అని సీఎం ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఆంధ్రపాలకులు నన్నయ్యను ఆదికవి అన్నారు కానీ వాస్తవానికి పాల్కురికి సోమనాథుడే ఆదికవి అని కేసీఆర్ స్పష్టం చేశారు. సీమాంధ్ర పాలనలో మన కవులను, కళాకారులను విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో విస్మరణకు గురైన తెలంగాణ ప్రముఖులకు తగిన గుర్తింపు ఇస్తామని ప్రకటించారు. ఎంతో గొప్పవారైన కాళోజీ నారాయణరావు, జయశంకర్‌సార్‌లు తెలంగాణ ఆవిర్భావం తర్వాత లేకపోవడం దురదృష్టమని విచారం వ్యక్తం చేశారు.
తెలంగాణ భాషాదినోత్సవంగా కాళోజీ జయంతి
తెలంగాణ నుడికారానికి, తెలంగాణ యాస, భాషలకు జీవం పోసిన కాళోజీ జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా నిర్వహించాలన్న కాళోజీ ఫౌండేషన్ విజ్ఞప్తిపై సీఎం సానుకూలంగా స్పందించారు. బుధవారమే దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయాలని రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ బీపీ ఆచార్యను ఆదేశించారు. కాళోజీ పేర ప్రతి ఏటా పురస్కారాలు అందజేయాలన్న విజ్ఞప్తిపైనా సానుకూలంగా స్పందించారు. కాళోజీ ఫౌండేషన్ ఒక సమావేశం పెట్టుకొని తీర్మానం చేసి పంపాలని, ఆ తరువాత తప్పకుండా అవార్డు విధి విధానాలు రూపొందించి అందజేస్తామని చెప్పారు. కాళోజీ పేరు మీద స్టాంపును విడుదల చేయాలని రాష్ట్ర క్యాబినెట్‌లో తీర్మానం చేసి, కేంద్ర ప్రభుత్వానికి పంపుతామని తెలిపారు.
రూ.12 కోట్లతో కాళోజీ కళాకేంద్రం
కాళోజీ కళాకేంద్రం వరంగల్‌కు అతుకనున్న అందమైన తునుక అవుతుందని సీఎం అభిలషించారు. కాళోజీ ఉన్నతమైన శిఖరమని అభివర్ణించిన కేసీఆర్.. చంద్రునికో నూలుపోగులాగా కాళోజీ పేరుతో అద్భుతమైన కళాకేంద్రం నిర్మాణం చేస్తాం. ఇది కాళోజీకి ఇచ్చే కానుక అని ప్రకటించారు. ఒకప్పుడు కాళోజీ ఫౌండేషన్‌కు 500 గజాల స్థలం కేటాయించాలని 12 ఏండ్లుగా తిరిగినా నాటి ఆంధ్ర సర్కారు ఇవ్వలేదు. అందుకే తెలంగాణ రాష్ట్రంలో కాళోజీ కళాకేంద్రానికి బాజాప్తా మూడున్నర ఎకరాల స్థలం కేటాయించాం.
ఇందులో మూడెకరాలు కళా కేంద్రానికి, అర ఎకరం కాళోజీ ఫౌండేషన్‌కు ఇస్తున్నాం అని చెప్పారు. రేపు కలెక్టర్‌గా ఎవరొస్తరో ఏమో.. అంతా బందోబస్తుగా ఉండెదానికి వీటిని వేర్వేరుగా రిజిస్ట్రేషన్ చేయించాలి అని జిల్లా కలెక్టర్ జీ కిషన్‌ను సీఎం ఆదేశించారు. కళాకేంద్రంలో మూడు భవనాలు ఉంటాయని చెప్పారు. 1500 మంది కూర్చునేలా విశాలమైన ఎయిర్‌కండిషన్డ్ హాల్, హాల్‌లోకి ప్రవేశించగానే నిలువెత్తు కాళోజీ కాంస్య విగ్రహం కనిపించేలా నిర్మిస్తామని చెప్పారు. రవీంద్రభారతికంటే అద్భుతంగా కాళోజీ కళాకేంద్రం ఉండాలన్నారు. ఇందులో రూ.50-60 లక్షలతో కాళోజీ ఫౌండేషన్ భవనాన్ని నేనే డిజైన్ చేసి నిర్మాణం చేపిస్తా అని కేసీఆర్ ప్రకటించారు.
ఆరేడు మాసాల్లో నిర్మాణం పూర్తి చేస్తామని, మళ్లీ ప్రారంభోత్సవానికి వస్తానని చెప్పారు. కాళోజీ కళా కేంద్రానికి రూ.12 కోట్లను వెంటనే మంజూరు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. కాళోజీ ఫౌండేషన్‌లో ఆయన రచనలు, చిత్రాలు ఏర్పాటు చేసి భావితరాలకు ఆయన ఘనతను చాటిచెప్పాలి అన్నారు. ఆంధ్ర వాళ్లు పొట్టోన్ని పోడుగోన్నిజేసి చూపిచ్చిండ్రు. అంతా ఇంగ్లీషు పదాలు వాడుకుంటూ మాదే అసలైన తెలుగని ఆంధ్రోళ్లు చెపుతాంటరు. సీరియల్‌అంటే తప్పులేంది.. సిల్‌సిలా అంటే తప్పేందని ప్రశ్నించిన వ్యక్తి కాళోజీ నారాయణ రావు అని కేసీఆర్ అన్నారు.
కాళోజీ కుటుంబం కోసం రూ.10 లక్షలు
కాళోజీ కుటుంబం పుట్టెడు కష్టాల్లో ఉన్నదని, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నదని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని చెప్పారు. కాళోజీ కుటుంబం కోసం రూ.10 లక్షలను కాళోజీ ఫౌండేషన్ పేర ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తామని, దాని ద్వారా వచ్చే డబ్బును కాళోజీ కుటుంబానికి నెలనెలా అందజేసే బాధ్యత ఫౌండేషన్ తీసుకోవాలని సీఎం కోరారు.
భారతదేశంలో రెండు దేశాలు
భారతదేశంలో రెండు దేశాలున్నాయి. ఒకటి బంగ్లాలున్న భారతదేశం, మరోటి గుడిసెలున్న భారతదేశం అని ఈ కార్యక్రమానికి వచ్చే ముందు తనకు కేశవరావుకు మధ్య చర్చ జరిగింది అని కేసీఆర్ చెప్పారు. ఈ పరిస్థితి మారాలన్నారు. ఇళ్లులేని పేదవాళ్లకు యాభై గజాల ఇంటి స్థలం ఇవ్వలేని దుస్థితిలో ఉన్నామంటే నిజంగా బాధపడాల్సిందేనని అన్నారు. హైదరాబాద్‌లో ఫుట్‌పాత్‌లమీద రోజుకు 4లక్షలమంది పడుకుంటున్నారంటే సిగ్గుతో నేను తలదించుకున్నా.
గిసొంటి రాష్ట్రానికేనా నేను ముఖ్యమంత్రి అయిందని అంటూ కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్ అధ్యక్షత వహించిన ఈ సభలో రాష్ట్ర శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య, టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్, రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు, ఎంపీ కడియం శ్రీహరి, కాళోజీ ఫౌండేషన్ అధ్యక్షులు నాగిళ్ల రామశాస్త్రి తదితరులు ప్రసంగించారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, పలుశాఖల ఉన్నతాధికారులు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. అంతకుముందు ముఖ్యమంత్రి నక్కలగుట్టలోని కాళోజీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. బాలసముద్రంలోని కాళోజీ కళాకేంద్రానికి భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కొండా సురేఖ, అజ్మీరా చందూలాల్, బానోత్ శంకర్‌నాయక్, డీఎస్ రెడ్యానాయక్, దొంతి మాధవరెడ్డి, ప్రముఖ రచయిత అంపశయ్య నవీన్, ప్రభుత్వ సలహాదారు పాపారావు, పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి బీపీ ఆచార్య తదితరులు పాల్గొన్నారు.
నమస్తే తెలంగాణ సౌజన్యంతో..