mt_logo

టీఆర్ఎస్ ను గెలిపిస్తే ప్రజలచేతిలోనే రిమోట్-నాయిని నర్సింహారెడ్డి

మహబూబ్ నగర్ జిల్లా వైసీపీ ఇన్చార్జి ఎం సురేందర్ రెడ్డితో పాటు మరికొందరు నేతలు బుధవారం తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ సెక్రెటరీ జనరల్ కేకే సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా కేకే మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో 1200 మందికిపైగా ప్రాణాలు పోగొట్టుకున్నారని, వేలమంది జైళ్ళకు పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. జైళ్లకు వెళ్ళినవారిని విడిపించేందుకు బెయిల్ కోసం రెండు కోట్ల రూపాయల దాకా కట్టామని, ఇన్ని బాధలు పెట్టాకకూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ మేమే తెచ్చాం, మేమే ఇచ్చాం అంటుంటే సిగ్గుగా ఉందని కేకే విమర్శించారు. పోలీసులు పెట్టిన కేసుల వల్ల తెలంగాణ విద్యార్థులు ఉద్యోగాలు పోగొట్టుకున్నారని, దానికి కాంగ్రెస్ నేతలే కారణమని దుయ్యబట్టారు. ఎన్నికలు వస్తుండటంతోనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందని, పార్లమెంటు ప్రజల సభ అని, అందరూ సహకరిస్తేనే తెలంగాణ వచ్చిందని అన్నారు. కాంగ్రెస్ నేతలు ఎంత మాట్లాడినా తెలంగాణ ప్రజల ఆదరణను పొందలేరని పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీలోకి ఎందరో వచ్చి చేరుతున్నారని, తెలంగాణ పునర్నిర్మాణ ఉద్యమం చెయ్యడానికి సిద్ధంగా ఉండాలని తెలంగాణ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ పునర్నిర్మాణం కేసీఆర్, ఆయన సహచరులవల్లే జరుగుతుందని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పోలిట్ బ్యూరో సభ్యుడు నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ను గెలిపిస్తే రిమోట్ డిల్లీలో ఉంటుందని, ఒక్కసారి టీఆర్ఎస్ ను గెలిపించి చూడాలని, టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే రిమోట్ తెలంగాణ ప్రజల చేతుల్లోనే ఉంటుందని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *