mt_logo

ఇదో విషాంధ్ర మహాసభ!

By: కొణతం దిలీప్

అంతర్జాలంలో తప్ప బయటెక్కడా కానరాని ఆ సంస్థ పేరు విశాలాంధ్ర మహాసభ. పైకి వినిపించేది సమైక్యవాదం, అసలు లక్ష్యం తెలంగాణపై విషం చిమ్మడం. అందుకే దాన్ని విషాంధ్ర మహాసభ అనడం సబబుగా ఉంటుంది.

ఇంతకాలం ఇటువంటి కోన్ కిస్కా గాళ్ల గురించి రాయడం టైం వేస్ట్ అని ఊరుకున్నాను గానీ నిన్నటి సభలో వీరి రింగ్ మాస్టర్ అయిన పరకాల ప్రభాకర్ తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ సార్ మీద పేలిన అవాకులు చవాకులు విన్నాక, ఇక రాయక తప్పదనిపిస్తోంది.

తెలంగాణపై విషం చిమ్మడం ఈ విషాంధ్ర మహాసభకు కొత్త కాదు. తమనెవరూ గమనించట్లేదనుకుని ఈ తొట్టి గ్యాంగ్ గత కొన్ని నెలలుగా అంతర్జాలంలో నానా చెత్తనూ పోగేస్తున్నారు.

జయశంకర్ సార్ మరణించినప్పుడు యావత్ తెలంగాణ సమాజం శోకసంద్రంలో మునిగింది. పచ్చి సమైక్యవాదులుగా ముద్రపడ్డ చంద్రబాబు, జగన్, నాగభైరవ జయప్రకాష్ నారాయణ కూడా సార్ మృతికి నివాళులు అర్పించారంటేనే ఆయన గొప్పతనం అర్థం అవుతుంది మనకు.

అలాంటి మనిషి మీద పరకాల బ్యాచి కక్కిన విషం చూడండి:

ఇక జయ శంకర్ సార్ మరణించిన కొన్నాళ్లకే ఈ విషాంద్ర మహాసభ వారి వెబ్ సైట్ లో ప్రచురితమైన ఈ హేయమైన వ్యాసం చదవండి. [Click on the Image to view full size)

ఈ వ్యాసం చూసిన విషాంద్ర మహాసభ సభ్యులే అభ్యంతరం వ్యక్తపరిచే సరికి వెబ్ సైట్ నుండి వ్యాసాన్ని తొలగించేశారు.

ప్రొఫెసర్ జయశంకర్, ప్రొఫెసర్ బుర్రా రాములు గురించి ఇన్ని నీచమైన అబద్దాలను అలవోకగా రాయగలిగేవాడు అసలు మనిషేనా?

అజాత శత్రువుగా ఉండి, తాము పుట్టిన గడ్డకొరకు జీవితాన్నే ధారపోసి, తమకంటూ ఏమి మిగుల్చుకోకుండా వెళ్ళిపోయిన మహామనుషుల గురించి, సమైక్యతను భుజాన వేసుకున్న సంకుచిత మనుషుల ప్రేలాపనలివి.

పైకి పెద్ద మనుషుల్లా కనపడే సమైక్య రాకాసుల అసలు రూపాలు ఇవి.

కడుపు నిండా కాలకూట విషం నింపుకున్న ఈ విష నాగులా తెలంగాణ ప్రజలకు సమైక్యత పాఠాలు నేర్పేది?

మన కళ్లముందే నిన్నటి వరకూ ఉన్న ఒక మహామనిషిని గురించి సిగ్గూ ఎగ్గూ లేకుండా ఇన్నిన్ని అబద్ధాలను ఆడగలిగిన ఈ దగుల్బాజీలను ఏమనాలి?

అసలీ విషాంధ్ర వెనుక ఉన్న వ్యక్తులకు ఒక్కొక్కరికి ఒక్కో వింత చరిత్ర ఉంది. ఒకరేమో రాష్ట్రమే కాదు, ఏకంగా దేశాన్నే వదిలి వెళ్ళి, సరిగా తెలుగులో నాలుగు ముక్కలు మాట్లడలేని అబద్దాలకోరు. ఇంకొకరు ఎక్కడ అడుగుపెడితే అక్కడ కాసింత బొగ్గూ, బూడిదా తప్ప ఏమీ మిగల్చని ఐరన్ లెగ్ . వీళ్లిద్దరే కాక ఇంకో ఇద్దరు ముగ్గురు జోకర్లు కూడా ఉన్నారు. వారి గురించి ఆనక మాట్లాడుకుందాం.

ముందీ ఐరన్ లెగ్ పరకాల ప్రభాకర్ గురించి కాస్త బ్యాక్ గ్రౌండ్ తెలుసుకుందాం.

పరకాల శేషావతారం అనే సీనియర్ కాంగ్రెస్ నాయకుని పుత్రరత్నమే పరకాల ప్రభాకర్. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి పీహెచ్ డి పట్టా పొందిన ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీలో చేరి తండ్రి పేరు నిలబెడదామని ప్రయత్నించి తన వల్లకాక బీజేపీలో చేరాడు.

1998 పార్లమెంటు ఎన్నికల్లో నరసాపురం పార్లమెంటు నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్దిగా పరకాల పోటీ చేశాడు. దేశమంతా బీజేపీ గెలిచిన ఆ ఎన్నికల్లో పరకాల డిపాజిట్ కూడ దక్కించుకోలేక, చిత్తుచిత్తుగా ఓడిపోయాడు.

కొన్నాళ్లకు పరకాల రామోజీ పంచన చేరాడు. చిరంజీవి పార్టీ పెట్టగానే తన తండ్రికి, అల్లు రామలింగయ్యతో ఉన్న పరిచయాన్ని ఉపయోగించుకుని ప్రజారాజ్యం అధికార ప్రతినిధిగా అవతారమెత్తాడు.

చివరికి ప్రజారాజ్యంలో పార్లమెంటు టికెట్ దొరకకపోవడంతో ఆ పార్టీని తిట్టినతిట్టు తిట్టకుండా తిట్టి మళ్ళీ రోడ్డునపడ్డాడు.

గత కొంతకాలంగా ఈ విషాంధ్ర సభ గొడుగు వేసుకుని సమైక్యవాదం పేరిట అంతర్జాలంలో తెలంగాణ వ్యతిరేక ఉద్యమం మొదలుపెట్టాడు.

అటు బీజేపీలో, ఇటు ప్రజారాజ్యంలో తెలంగాణకు మద్ధతుగా అనేక సార్లు మాట్లాడిన నోటితోనే ఇప్పుడు సమైక్య చిలుకపలుకు పలకడానికి పరకాలకు సిగ్గెందుకు అనిపించడంలేదోనని ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది నాకు.

అన్నిటికన్నా ఘోరమైన విషయమేమిటంటే పరకాల గారి సతీమణి నిర్మల సీతారామన్ గారు బీజేపీ అధికార ప్రతినిధి హోదాలో తెలంగాణ ఉద్యమంలో చురుకుగా ఉండటం. మొన్న నల్లగొండలో జరిగిన బీజేపీ తెలంగాణ పోరు సభకు నిర్మల గారు కూడా హాజరయ్యారు.

పరకాల సమైక్య సిద్ధాంతాలు ఆమెకు బోదించట్లేదో, లేక ఇద్దరూ చెరో క్యాంపులో ఉంటే సేఫ్ అనుకుంటున్నారో తెలియదు కానీ, ఒక ఇంట్లోనే ఏకాభిప్రాయం సాధించలేని పరకాల తగుదునమ్మా అని రాష్ట్ర సమైక్యత గురించి పాఠాలు వల్లె వేస్తున్నాడు.

ఏ చెట్టూ లేని దగ్గర ఆముదపు మొక్కే మహావృక్షం అయినట్టు దిక్కూ మొక్కూ లేని సమైక్య ఉద్యమానికి ఇప్పుడు ప్రభాకర్ లాంటి నీతీ, జాతి లేని వారే దిక్కయ్యారు. అది చూసుకుని ప్రభాకర్ రెచ్చిపోతున్నాడు.

ఈ సందర్భంగా ప్రభాకర్ కు ఒకటే చెప్పదలిచాను.

నరం లేని నాలుకతో, నాలుగు పార్టీలు మారి, పూటకో వేషం కట్టే నీలాంటి పగటి వేషగాళ్లను ఎందరినో తెలంగాణ ప్రజలు చూశారు.

సమైక్యవాదం ముసుగులో తెలంగాణపై నువ్వూ, నీ సంస్థా చిమ్ముతున్న విషాన్ని మేం గమనిస్తున్నాం.

సమయం చూసి నీకు కర్రుకాల్చి వాత పెడతాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *