శుక్రవారం సచివాలయంలో ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ విలియం డీ డార్, డైరెక్టర్ సుహాస్ పీ వాణి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, రైతుల భూముల్లో భూసార పరీక్షలు నిర్వహిస్తామని ఎన్నికల మానిఫెస్టోలో చెప్పామని, రేగడి భూములు, ఎర్ర జెక్క, చౌడు ఇలా ఒక్కొక్క జిల్లాలో ఒక్కో రకం నేలలున్నాయని, ఏ నెల ఏ పంటకు అనుకూలంగా ఉంటుంది? నేలల్లో భూసారం ఎంత ఉంది? అన్న వివరాలతో పాటు, ఏ వాతావరణ పరిస్థితుల్లో ఏ పంటలు సాగుచేస్తే అధిక దిగుబడులు వస్తాయనే అంశాలపై దృష్టి పెడతామని కేసీఆర్ చెప్పారు.
కర్ణాటక తరహాలో రాష్ట్రంలో భూసార పటాన్ని రూపొందించాలని నిర్ణయం తీసుకున్నామని, అన్ని నేలల్లో భూసార పరీక్షలు నిర్వహించి రైతులకు సాయిల్ హెల్త్ కార్డులు జారీ చేస్తామని అధికారులకు తెలిపారు. భూసార పరీక్షలు నిర్వహించక పోవడంతో ఇన్ని రోజులుగా అన్ని నేలల్లోనూ రైతులు ఒకే రకమైన పంటలు వేస్తున్నారని, దానిమూలంగా ఆశించిన దిగుబడులు రాక ఆర్ధికంగా నష్టపోతున్నారన్నారు. భూసార పరీక్షలు నిర్వహించడం ద్వారా రైతు తన భూమి స్వభావం సులభంగా అర్ధం చేసుకోవచ్చని, తెలంగాణ రాష్ట్రాన్ని విత్తన భాండాగారంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని వనరులు ఉన్నాయని సీఎం పేర్కొన్నారు.