తెలంగాణ నెటిజన్స్ ఫోరం, వరంగల్ నిట్ జేఏసీ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా కాజీపేటలోని నిట్ కాన్ఫరెన్స్ హాల్లో ప్రొఫెసర్ జయశంకర్ సార్ స్ఫూర్తిలో తెలంగాణ పునర్నిర్మాణంపై ఆదివారం జరిగిన సమావేశంలో టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమం నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పుకునేదిలేదని, ఉద్యమంలో ఎంత కార్యదీక్షతో పాల్గొన్నానో అంతకంటే ఎక్కువ స్థాయిలో తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో పాల్గొంటానని ఆయన స్పష్టం చేశారు.
ఉద్యోగంలో చేరుతారని, ఇకపై ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తారా?లేదా? అనే ప్రశ్నకు సమాధానంగా కోదండరాం పై విధంగా స్పందించారు. జయశంకర్ సార్ కలలుగన్న బంగారు తెలంగాణను సాధించి తీరుతామని, ఎన్ని అవాంతరాలు ఎదురైనా వెనక్కు తగ్గేది లేదని, ఇన్నాళ్ళూ తెలంగాణ కోసం ఉద్యమించిన జేఏసీ, ముందుముందు పునర్నిర్మాణం కోసం కొత్త కార్యాచరణను అమల్లో పెడ్తుందని ఈ సందర్భంగా ఆయన వివరించారు. తెలంగాణ పునర్నిర్మాణం కోసం తెలంగాణ 10జిల్లాల్లో ఇలాంటి సమావేశాలు నిర్వహించి ప్రజలను చైతన్యపరచాలని అన్నారు. సీమాంధ్ర నేతలు బిల్లుపై చర్చను అడ్డుకున్నా వచ్చే తెలంగాణ ఆపలేరని, సీమాంధ్ర ప్రజలకు ఏమి కావాలో వాటిపై చర్చిస్తే సీమాంధ్ర ప్రాంతానికి తగు న్యాయం చేసినవారవుతారని సూచించారు. తెలంగాణ ప్రజలకు అన్ని రంగాల్లో తేడా లేకుండా అభివృద్ధిలో వాటా ఇవ్వాలని, వారంతా స్వేచ్ఛగా జీవించే హక్కులు కలిగిఉండాలని ఆయన కోరిక వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీ నెటిజర్స్ ఫోరం అడ్వైజర్ కే. జగదీష్, జయశంకర్ సార్ రీసర్చ్ సెంటర్ ఫౌండర్ వీ. ప్రకాష్, నిట్ జేఏసీ చైర్మన్ రామచంద్రం తదితరులు పాల్గొన్నారు.