mt_logo

హైదరాబాద్ లో త్వరలో సినిమా సిటీ..

గురువారం సచివాలయంలో పారిశ్రామిక విధానంపై జరిగిన సమీక్షాసమావేశంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, హైదరాబాద్ నగరంలో దాదాపు రెండువేల ఎకరాల విస్తీర్ణంలో సినిమా సిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సినిమా సిటీ వల్ల రాజధానిలో సినీ పరిశ్రమ మరింత అభివృద్ధి చెందుతుందని, స్థానికులకు మరింత ఉపాథి, ఉద్యోగావకాశాలు లభిస్తాయని, సాహితీరంగంలోని వారికి కూడా మరిన్ని అవకాశాలు లభిస్తాయని కేసీఆర్ అన్నారు.

హైదరాబాద్ నుండి సినీ పరిశ్రమ తరలిపోతుందని వస్తున్న అసత్యప్రచారాన్ని ఆయన కొట్టిపడేశారు. ఎట్టిపరిస్థితుల్లో పరిశ్రమ హైదరాబాద్ నుండి తరలిపోదని, ఇంత మంచి వాతావరణం ఉన్న నగరం ఎక్కడా లేదని, అన్ని వసతులూ కల్పిస్తే ఇతర రాష్ట్రాలవారు కూడా ఇక్కడికే వస్తారని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా సినిమాల్లో గ్రాఫిక్స్, ఎఫెక్ట్స్ లాంటి సాంకేతిక అంశాలకు చాలా ప్రాముఖ్యం ఉందని, వాటికి అనుగుణంగా సినిమా సిటీని రూపొందించాలని కేసీఆర్ అధికారులకు సూచించారు.

రాష్ట్రంలో మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారు. తెలంగాణలో అపారమైన ఖనిజ నిక్షేపాలు ఉన్నాయని, వాటిని వెలికితీసి పారిశ్రామికీకరణకు ఉపయోగించాలని, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలోని ఖనిజాలు, గనులను తీవ్ర నిర్లక్ష్యానికి గురిచేశారని వివరించారు. వరంగల్, ఖమ్మం జిల్లాలోని లక్షా యాభైవేల ఎకరాల్లో ఖనిజ సంపద ఉంటే అది పనికిరాదని దుష్ప్రచారం చేశారని, ప్రస్తుతం అదే ఖనిజంతో 30వేల కోట్ల రూపాయలతో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టేందుకు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ముందుకు వచ్చిందని కేసీఆర్ చెప్పారు.

ఇవేకాకుండా వివిధ ఇతర అంశాలైన ఫార్మా, కెమికల్ సిటీలను ఏర్పాటు చేయడం, సీడ్ సిటీ ఏర్పాటు, ఐటీ హార్డ్ వేర్, పారిశ్రామికరంగంలో సింగిల్ విండో విధానం అమలు చేయడం లాంటి అనేక అంశాల గురించి ముఖ్యమంత్రి సమీక్ష జరిపారు. టీఎస్ఐఐసీకి ఐదు లక్షల ఎకరాల భూమిని అప్పగించడం వల్ల పారిశ్రామిక వాడల అభివృద్ధి జరుగుతుందని కూడా సీఎం తెలిపారు. ఈ సమావేశంలో సీఎంవో ముఖ్య కార్యదర్శి ఎన్ నర్సింగరావు, ప్రభుత్వ సలహాదారు బీవీ పాపారావు, టీఎస్ఐఐసీ ఎండీ జయేష్ రంజన్, పరిశ్రమల శాఖ కార్యదర్శి ప్రదీప్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *