హైదరాబాద్ నగరం భౌగోళికంగా అందరికీ అనుకూలమైన ప్రాంతమని, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని రాష్ట్ర ఐటీ, పంచాయితీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఖైరతాబాద్ లో జరిగిన అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా సదస్సులో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దే క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకెళ్తున్నారని, వచ్చే పదిహేనేళ్ళలో నగరం మూడింతలుగా విస్తరిస్తుందని తెలిపారు.
షాద్ నగర్, భువనగిరి, గజ్వేల్ లాంటి పరిసర ప్రాంతాల దాకా హైదరాబాద్ నగరాన్ని విస్తరిస్తామని, హైదరాబాద్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నామని చెప్పారు. మెట్రో రైలు అందుబాటులోకి వస్తే ప్రజా రవాణా వ్యవస్థ మరింత మెరుగవుతుందని, కొత్త రాష్ట్రంలో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యం అని కేటీఆర్ పేర్కొన్నారు.
మరోవైపు తాజ్ క్రిష్ణాలో జరిగిన ఇండో గ్లోబల్ హెల్త్‌కేర్ సదస్సులో పాల్గొన్న కేటీఆర్ మాట్లాడుతూ, హైదరాబాద్ నగరాన్ని ఆరోగ్య రాజధానిగా తీర్చిదిద్దుతామని, అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన వసతులు కల్పిస్తామని చెప్పారు. రాష్త్ర బడ్జెట్‌లో 10శాతం వైద్యరంగానికి కేటాయించామని, మెడికల్ టూరిజంకు పెద్దపీట వేస్తామని, ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు, హెల్త్ కార్డులు జారీ చేస్తామని కేటీఆర్ తెలిపారు.