mt_logo

దేశానికి రెండో ఆర్ధిక రాజధానిగా హైదరాబాద్ – కేసీఆర్

హైదరాబాద్ ను డిజిటల్ సిటీగా, ప్రపంచమంతా గుర్తించే దిశగా దేశానికి రెండవ ఆర్ధిక రాజధానిగా మార్చేందుకు కార్యాచరణ రూపొందిస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు చెప్పారు. నానక్‌రాంగూడలోని ఐటీ సెజ్ లో టిష్‌మ్యాన్ స్పైర్ కంపెనీ నిర్మించిన వేవ్‌రాక్ ఐటీ పార్క్ ను మంగళవారం సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఆవరణలో ఒక మొక్కను నాటారు.

సీఎం మాట్లాడుతూ, ఐటీ రంగంలో ఎదురవుతున్న పోటీని తట్టుకోవాలంటే హైదరాబాద్ ఆ రంగంలో కొత్త కొత్త ఆవిష్కరణలకు కేంద్రంగా మారాలని, అంతర్జాతీయ నగరంగా హైదరాబాద్ ను రూపొందించేందుకు మాస్టర్ ప్లాన్ తో ముందుకు పోతున్నామని స్పష్టం చేశారు. నగరంలో కొత్తగా ప్రాజెక్టులు ప్రారంభించేందుకు ముందుకు వచ్చే వారికి కావాల్సిన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని, ప్రపంచంలోనే ఉత్తమమైన పారిశ్రామిక విధానం ప్రకటిస్తున్నామని కేసీఆర్ చెప్పారు.

అధికారులతో సమావేశం నిర్వహించి పారిశ్రామిక విధానం ఫైనల్ చేయబోతున్నామని, హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టడానికి వచ్చే వారికి స్వాగతం పలుకుతామని, రాష్ట్ర ప్రొటోకాల్ అధికారి శంషాబాద్ వెళ్లి వెల్‌కం చెప్తాడని తెలిపారు. ఐటీ, పరిశ్రమల రంగాల్లో పెట్టుబడులకు అనుమతుల కోసం సింగిల్ విండో విధానం ఉంటుందని, సీఎం కార్యాలయంలోనే విభాగం ఉంటుందని, రెండు నుండి మూడున్నర వారాల్లో అన్ని రకాల అనుమతులు ఇప్పించి ఒకే ఫైల్ లో పారిశ్రామికవేత్తలకు వాటిని అందిస్తామని స్పష్టం చేశారు.

అవినీతిని జీరోకు తీసుకెళ్ళడమే తమ లక్ష్యమని, బ్రాండ్ హైదరాబాద్, బ్రాండ్ తెలంగాణకు గుర్తింపు తెస్తామని అన్నారు. టిష్‌మ్యాన్ స్పైర్ కంపెనీ హైదరాబాద్ లో ఇంత పెద్ద భవనాన్ని నిర్మించడం సంతోషంగా ఉందని, దేశంలోని ఎన్నో నగరాలను వదిలిపెట్టి ఇక్కడకు ఈ కంపెనీ రావడం గర్వంగా ఉందని సీఎం అన్నారు.

ఐటీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, హైదరాబాద్ కు ఈ భవనం ల్యాండ్‌మార్క్ గా మారుతుందని, ఇలాంటి పెద్ద కంపెనీలు హైదరాబాద్ కు రావడం పట్ల గర్వంగా ఉందని తెలిపారు. దేశంలో రాజకీయ సుస్థిరత ఉండటం అనుకూల అంశమని, హైదరాబాద్ టెక్నో సిటీగా మారుతుందని కేటీఆర్ పేర్కొన్నారు. కంపెనీ సీఈఓ జెర్రీ స్పైర్ మాట్లాడుతూ, కొత్త రాష్ట్రానికి కేసీఆర్ సీఎంగా ఉన్నారని, ఆయన నేతృత్వంలో హైదరాబాద్ వ్యాపార, వాణిజ్య రంగాల్లో ముందుకెళ్ళాలని, కేసీఆర్ పాలనలో భవిష్యత్తు అంతా బాగుండాలని, హైదరాబాద్ టెక్నో సిటీగా మారాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *