ఇండియా గాడ్జెట్ ఎక్స్ పో – 2014ను ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కే తారకరామారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, సాఫ్ట్ వేర్ రంగంలో హైదరాబాద్ దేశంలోనే రెండవస్థానంలో ఉందని, హైదరాబాద్ ను హార్డ్ వేర్ హబ్ గా రూపొందిస్తామని చెప్పారు. నగరాన్ని సాంకేతిక నగరంగా అభివృద్ధి చేస్తామని, త్వరలోనే మహేశ్వరంలో రెండు ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్స్ ఏర్పాటవుతాయని తెలిపారు.
ప్రపంచంలోనే పేరొందిన హార్డ్ వేర్ సంస్థలు పెట్టుబడులు పెడతాయని, ఇన్నోవేషన్ క్యాపిటల్ గా హైదరాబాద్ ను తీర్చిదిద్దుతామని అన్నారు. హైదరాబాద్ కొద్దిరోజుల్లో వైఫై నగరంగా అభివృద్ధి చెందుతుందని, ప్రముఖ కంపెనీలు తమను సంప్రదిస్తున్నాయని కేటీఆర్ చెప్పారు.
మరోవైపు టీవీ9, ఏబీఎన్ చానళ్ళ బంద్ తో ప్రభుత్వానికి సంబంధం లేదని, ఛానళ్ళ బంద్ కు పిలుపునిచ్చిన ఎంఎస్ వోల నిర్ణయాన్ని ప్రభుత్వంపై రుద్ది బురదజల్లే కార్యక్రమం వద్దని, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని మంత్రి కేటీఆర్ సూచించారు.