ఇకపై హైదరాబాద్ లో కొత్తగా నిర్మించే ఇళ్ళపై రూఫ్ టాప్ సోలార్ విద్యుత్ ప్యానెళ్ళను ఏర్పాటు చేయాల్సిందిగా జీహెచ్ఎంసీ అధికారులను ఐటీ శాఖామంత్రి కే తారకరామారావు ఆదేశించారు. నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ ను కొంతవరకైనా తీర్చేందుకు ఇది దోహదపడుతుందని, స్మార్ట్ సిటీ అంటే కేవలం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవడమే కాదని, జీవనప్రమాణాలను మెరుగుపర్చడం, నాణ్యమైన సేవలను అందించడమని చెప్పారు.
అక్టోబర్ 6 నుండి 10 వ తేదీవరకు జరగనున్న 11వ అంతర్జాతీయ మెట్రోపొలిస్ సదస్సు సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం బంజారాహిల్స్ లోని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ఆస్కీ), జీహెచ్ఎంసీ నిర్వహించిన భారత నగరాలు- స్మార్ట్ సిటీలుగా మార్పు అనే అంశంపై జరిగిన వర్క్ షాప్ కు ముఖ్య అతిధిగా ఐటీ, పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భవనాలపై సోలార్ ప్యానళ్ళ ఏర్పాటుకు ఇప్పటికే నిబంధనలు ఉన్నప్పటికీ అవి అమలుకు నోచుకోవడంలేదని, ఇకపై దీన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ను ఆదేశించారు.
కేవలం లేఔట్ల ఏర్పాటుతో స్మార్ట్ సిటీ అనిపించుకోదని, అమెరికా, బ్రిటన్, బ్రిస్ బేన్ వంటి దేశాల్లో స్మార్ట్ సిటీకై చేపట్టిన పద్ధతులు మన దేశంలో చేపట్టేందుకు అవకాశం లేదని, మన దేశంలో ఏ కొత్త విధానం ప్రవేశపెట్టినా ప్రజలు అర్ధం చేసుకోవడానికి సమయం పడుతుందని అన్నారు. కొత్త విధానంపై ప్రజల్లో అవగాహన కల్పించడంతోపాటు క్రమశిక్షణ అలవాటయ్యేలా తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని, నగరంలో భద్రతను పెంచేందుకు 50 వేల సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు.
