mt_logo

హైదరాబాద్ లో అంగుళం కూడా కబ్జా కానివ్వం – కేసీఆర్

ఆరునూరైనా హైదరాబాద్ లో ఒక్క అంగుళం భూమి కూడా కబ్జా కానివ్వమని, గత ప్రభుత్వాలు ఇచ్చిన ఆదేశాలు ఇక్కడ సాగవని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం జరిగిన మంత్రివర్గ సమావేశం తర్వాత విలేకరులు అడిగిన ప్రశ్నలకు సీఎం క్రింది విధంగా సమాధానాలు ఇచ్చారు.

భూదాన్ బోర్డు భూముల అక్రమాలను ఏమి చేస్తారని అడుగగా, భూదాన్ బోర్డును ప్రభుత్వం ఇప్పటికే రద్దు చేసిందని, అధికారులు రికార్డులను సీజ్ చేసారని, త్వరలో భూదాన్ చట్టం రాబోతుందని కేసీఆర్ తెలిపారు. భూములను అక్రమంగా కొన్నవాళ్ళు, అమ్మినవాళ్ళు స్వచ్చందంగా సరెండర్ చేస్తే బతికి పోతారు, లేకపోతే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఎక్కడ చూసినా వందల, వేల కోట్ల కుంభకోణాలు. గతంలో గృహనిర్మాణ పథకాల్లో కేవలం 590 గ్రామాల్లో 530కోట్ల అవినీతి జరిగిందని ప్రభుత్వ లెక్కల్లోనే తేలిందని, 84లక్షల మంది పేద కుటుంబాలు ఉంటే 91లక్షల తెల్ల రేషన్ కార్డులు వినియోగంలో ఉన్నాయని అన్నారు.

అక్రమ నిర్మాణాలను ఏం చేయబోతున్నారని ప్రశ్నించగా, సచివాలయానికి కూతవేటు దూరంలో వందల, వేల అక్రమ నిర్మాణాలు జరిగాయని, దేవాలయ భూముల కబ్జా, ఇఎన్ టీ ఆసుపత్రి భూములు కబ్జా.. లెక్కలేనన్ని భూములు అక్రమంగా కబ్జాకు గురవుతున్నాయని, అక్రమ నిర్మాణాల విషయంలో ఇది ఆరంభం మాత్రమేనని, ఇకపై ఉగ్రనరసింహ అవతారం ఎత్తుతానని, ప్రతి ఇంచు ఇంచుకు సీసీ కెమెరాలు వస్తాయని హెచ్చరించారు. చినుకు పడితే సచివాలయం, రాజ్ భవన్, అసెంబ్లీ ముందు మోకాళ్ళ లోతు నీళ్ళు నిలబడ్తున్నాయని, ఐటీ, గీటీ అన్నవాళ్ళకు ఇవేవీ కనిపించట్లేదని మండిపడ్డారు.

హైదరాబాద్ పై గవర్నర్ అధికారాలు ఎట్టిపరిస్థితుల్లో ఒప్పుకునేదిలేదని, కేంద్రం దురుసుగా ప్రవర్తిస్తే జాతీయస్థాయిలో ముఖ్యమంత్రులతో కలిసి యుద్ధం ప్రకటిస్తామని చెప్పారు. ల్యాంకో అక్రమాలను సహించేదిలేదని, ఎట్టిపరిస్థితుల్లో దాన్ని వదలమని, వక్ఫ్ భూములను గత ప్రభుత్వం ఎవరికైనా కేటాయించినట్లయితే ఆ భూములకు చెందిన పరిహారాన్ని లేదా ప్రత్యామ్నాయ భూమిని ప్రభుత్వం వక్ఫ్ బోర్డుకు ఇస్తుందని స్పష్టం చేశారు. హైదరాబాద్ చుట్టూ డంపింగ్ యార్డుల కోసం రెండువేల ఎకరాల స్థలాన్ని కేటాయిస్తామని చెప్పారు.

చానళ్ళ నిలిపివేతపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలపై మీ స్పందన ఏమిటని ప్రశ్నించగా, చానళ్ళ నిలిపివేతకు, మా ప్రభుత్వానికి సంబంధం లేదని కేసీఆర్ సమాధానం ఇచ్చారు. పేదలకు గ్రామీణ ప్రాంతాల్లో 125గజాల స్థలంలో ఇళ్ళు, పట్టణాల్లో ఫ్లాట్ రూపంలో ఇంటి వసతి కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *