సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో మహిళలు ముందంజలో ఉన్న నగరాల్లో హైదరాబాద్ టాప్ సిటీగా నిలిచింది. ‘టాప్ సిటీస్ ఫర్ వుమెన్ ఇన్ ఇండియా’ పేరుతో అవతార్ గ్రూప్ గురువారం విడుదల చేసిన నివేదికలో తెలంగాణ రాజధాని మహిళలకు అత్యంత సురక్షిత నగరంగా అరుదైన గౌరవాన్ని దక్కించుకొన్నది. మహిళలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, సామాజిక భద్రత తదితర అంశాలపై విశ్లేషించే అవతార్ గ్రూప్.. లివింగ్ ఇండెక్స్, జాతీయ గణాంకాలు, నేర రికార్డులు, మహిళా-శిశు సంక్షేమ శాఖ వార్షిక నివేదిక తదితర విభాగాల నుంచి సేకరించిన 200పైగా అంశాలను విశ్లేషించి వివిధ నగరాలకు ర్యాంకులు ఇచ్చింది. టాప్-5 నగరాల్లో వరుసగా చెన్నై, పూణె, బెంగళూరు తర్వాత హైదరాబాద్ నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో ముంబై ఉన్నది. దేశ రాజధాని ఢిల్లీ 14వ స్థానంలో ఉండటం గమనార్హం.
దక్షిణాది నగరాలే అత్యంత అనుకూలం :
అవతార్ గ్రూప్ ఏడాదిపాటు 111 నగరాల్లో సర్వేచేయగా, 9 నగరాలు మాత్రమే సిటీ ఇంక్లూజన్ స్కోర్‌లో 60కి 50 పాయింట్లను దాటాయి. అందులో దక్షిణాది నగరాలే ఎక్కువగా ఉండటం విశేషం. మహిళలకు అత్యంత అనుకూలమైన వాతావరణం కల్పించి.. అత్యంత నాణ్యమైన మౌలిక సదుపాయాలతో హైదరాబాద్ టాప్ ప్లేస్‌లో చోటు సంపాదించింది. దక్షిణాది రాష్ర్టాల్లో ఉద్యోగినులకు స్నేహపూర్వక వాతావరణం ఉన్నదని, ఇందుకు ఆయా ప్రాంతాల రాజకీయ, చారిత్రక నేపథ్యం దోహదపడుతున్నదని అవతార్ గ్రూప్ వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్ సౌందర్య రాజేశ్ తెలిపారు.
కాగా చెన్నై, పుణె, బెంగళూరు, హైదరాబాద్, ముంబై, అహ్మదాబాద్, విశాఖపట్నం, కోల్‌కతా, కోయంబత్తూర్, మధురై నగరాలు వరుసగా టాప్ 10లో ఉన్నాయి.