హైటెక్స్ లో జరుగుతున్న అంతర్జాతీయ మెట్రోపొలిస్ సదస్సులో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, హైదరాబాద్ మేజర్ హిస్టారికల్ సిటీ అని, సదస్సుకు వచ్చిన ప్రతినిధులందరికీ హైదరాబాద్ నగరం తరపున స్వాగతం పలుకుతున్నట్లు తెలిపారు. మెట్రోపొలిస్ సదస్సు నిర్వహిస్తున్నందుకు సంతోషంగా ఉందని, హైదరాబాద్ అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నామని, తెలంగాణ పట్టణ జనాభా 40 శాతం దాటుతోందని వివరించారు. హైదరాబాద్ అభివృద్ధికి సహకరిస్తామన్న కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుకు ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.
గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ, నగరాల అభివృద్ధి విషయంలో సిటీస్ ఫర్ ఆల్ కాన్సెప్ట్ బాగుందని, ఈ సదస్సులో పాల్గొనడం సంతోషంగా ఉందని అన్నారు. నగరాలు ఒకప్పుడు ధనికులకు మాత్రమే పరిమితమయ్యేయని, కాలంతో పాటు నగరాలు కూడా మారాయన్నారు. నగరాల్లో సౌర విద్యుత్ ఉత్తమ పరిష్కారమని, వర్షపు నీటి సంరక్షణ ఏర్పాటు చేయని వారికి భవన నిర్మాణ అనుమతులు నిరాకరించాలని గవర్నర్ చెప్పారు. అనంతరం మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మెట్రోపొలిస్ సదస్సులో ప్రసంగిస్తూ, హైదరాబాద్ నగరాన్ని చూడగానే చరిత్ర, సంస్కృతి గుర్తొస్తాయని, చరిత్రకు చిహ్నమైన ఎన్నో కట్టడాలు నగరంలో ఉన్నాయని, హైదరాబాద్ లో భిన్న సంస్కృతులు మిళితమై ఉన్నాయని అన్నారు.