తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఖాయమైన సందర్భంగా హైదరాబాదును పదేళ్ళపాటు రెండు రాష్ట్రాలకూ ఉమ్మడి రాజధానిగా నిర్ణయిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో హైదరాబాదును యూటీ చేస్తారనే ఊహాగానాలకు తెరదించినట్లైంది.
సీమాంధ్ర నేతలు హైదరాబాదును యూటీ చేయాలని విశ్వప్రయత్నం చేశారు. తెలంగాణ నేతలు మాత్రం ఏ అడ్డంకులులేని హైదరాబాద్ మాత్రమే కావాలని చెప్పారు. దీంతో కేంద్రం దిగివచ్చి నగర పాలన విషయంలో కొన్ని మాత్రమే ఆంక్షలు విధించింది. శాంతిభద్రతలపై హక్కు తెలంగాణ గవర్నర్ చేపడతారు. కొత్తగా ఏర్పడబోయే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఏర్పడేవరకు నగరం నుంచే సీమాంధ్ర రాష్ట్ర పరిపాలన జరగనుంది.
2007, ఏప్రిల్ 14న జీహెచ్ఎంసీ ఏర్పడింది. దీని పరిధి 625 చదరపు కిలోమీటర్లు, 150 డివిజన్లు, పార్లమెంటు స్థానాలు-5, అసెంబ్లీ స్థానాలు-24, జోన్లు-5, సర్కిళ్ళు-18. విభజన అనంతరం గ్రేటర్ హైదరాబాద్ పూర్తిగా తెలంగాణ ప్రభుత్వ పరిధిలోనే ఉంటుంది.
శాంతిభద్రతలు గవర్నర్ చేతిలోకి వెళ్ళడం ద్వారా శాఖాపరమైన సమస్యలు వచ్చే అవకాశముందని పోలీస్ అధికారులు చెబుతున్నారు. పోలీస్ కమిషనర్ నియామకం ప్రస్తుతం సీఎం చేతిలో ఉంది. ఉమ్మడి రాజధానిలో సీపీని తెలంగాణ ముఖ్యమంత్రి నియమిస్తారా? లేదా గవర్నర్ నియమిస్తారా అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.