mt_logo

వార్ రూమ్ కు భారీగా ఫిర్యాదులు

టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటుచేసిన వార్ రూమ్ కు సీమాంధ్ర ఉద్యోగుల కుట్రలకు సంబంధించి అనేక ఫిర్యాదులు అందుతున్నాయని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, ఇప్పటివరకు 55 శాఖలనుంచి 560 మంది ఫిర్యాదు చేయగా, 386 మెయిల్స్, వెబ్ సైట్స్ ద్వారా 11 ఫిర్యాదులు అందాయని చెప్పారు. సీమాంధ్రలోని 13 జిల్లాల్లో తెలంగాణ ఉద్యోగులు 0.5 శాతం మంది ఉంటే, తెలంగాణలోని ఒక్క మహబూబ్ నగర్ జిల్లాలోనే 1175 మంది సీమాంధ్ర ఉద్యోగులు ఉన్నారని వివరించారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన 2 వేలమంది కానిస్టేబుల్స్ తెలంగాణ ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్నారని, తమకు వార్ రూమ్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను ఒక నివేదిక రూపంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందజేస్తామని తెలిపారు.

మరోవైపు రాజీవ్ విద్యామిషన్ లో పనిచేసే 2300 మంది కాంట్రాక్టు ఉద్యోగులను సీమాంధ్ర అధికారి తొలగించడం పట్ల ఆందోళన చెందిన కాంట్రాక్టు ఉద్యోగులు ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ స్వామిగౌడ్ లను తెలంగాణ భవన్ లో కలిశారు. ఎమ్మెల్సీ స్వామిగౌడ్ మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వంలో కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని కేసీఆర్ చెప్పినా ఉద్యోగులను తొలగించడం రెచ్చగొట్టడమే అని, కొత్తగా ఉద్యోగాలు రిక్రూట్ చేసుకోవద్దని, ఉన్నవారిని తొలగించవద్దని కేంద్రం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా ఎందుకు తొలగించారని ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *