mt_logo

కేంద్ర రైతుబంధు పథకానికి అర్హతలు, అనర్హతలు..

రైతుబంధు తరహాలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం అమలుపై కేంద్రం వేగం పెంచింది. ఈ పథకం మార్గదర్శకాల ముసాయిదాను విడుదల చేసింది. లబ్ధిదారుల జాబితాను గ్రామాల్లో అందరికీ అందుబాటులో ఉండేలా ప్రదర్శించనున్నట్టు స్పష్టంచేసింది. అర్హుల పేర్లు జాబితాలో లేకుంటే విన్నవించుకోవచ్చని తెలిపింది. ఈ నెల 25 నాటికి రాష్ట్రంలో ఉన్న అర్హులైన చిన్న, సన్నకారు రైతుల జాబితాను సిద్ధం చేసి పీఎం-కిసాన్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని ఆదేశించింది. మొదటి విడత సొమ్మును ఏడాదిలో ఎప్పుడైనా పొందేందుకు అవకాశం కల్పించారు. ఈ నెల 25 తర్వాత వివరాలు అప్‌లోడ్ చేసినా ఏడాదిలో ఎప్పుడైనా సొమ్మును ఖాతాలో వేస్తారు. ఐదెకరాల్లోపు ఉన్న ఒక కుటుంబం మాత్రమే రూ.6వేలు పొందడానికి అర్హులుగా నిర్ధారించారు. తాజా మార్గదర్శకాలలోని మరికొన్ని ముఖ్యాంశాలు..

అనర్హులు వీళ్లు..
* ఉన్నతాదాయవర్గాల వారు
* వేర్వేరు ప్రాంతాల్లో వివిధ సంస్థల కింద ఐదెకరాల లోపు భూమి ఉన్నవారు
* రైతు కుటుంబంలో ఎవరైనా రాజ్యాంగ పదవుల్లో ఉంటే వర్తించదు
* తాజా, మాజీ కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, జెడ్పీ తాజా, మాజీ చైర్మన్లు
* ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డు ఉద్యోగులు, స్వయం ప్రతిపత్తి గల సంస్థలు, ప్రభుత్వరంగ సంస్థల అధికారులు. నాలుగో తరగతి ఉద్యోగులకు మినహాయింపు.
* రూ.10వేల మించి పింఛన్ తీసుకునే ఉద్యోగులు, గతేడాది ఐటీ చెల్లించినవారు.

సొంత ధ్రువీకరణే కీలకం..
* లబ్ధిదారులే సొంత ధ్రువీకరణ ఇవ్వాలి. తప్పుడు సమాచారమిస్తే సొమ్ము వాపస్ తీసుకోవటంతోపాటు చట్టపర చర్యలు.
* ఐదెకరాల లోపు భూమిని వివిధ చోట్ల ఉండి ఉన్నా, ఇద్దరు ముగ్గురు కలిసి చేసుకుంటున్నా వారికి కూడా అందజేస్తారు.
* లబ్ధిదారుల డాటాబేస్‌ను సమగ్రంగా పంపాలి. గ్రామం పేరు, వయస్సు, సామాజిక వర్గం, బ్యాంకు ఖాతా, ఆధార్, సెల్‌నంబర్లు కూడా పంపాలి.

రాష్ట్రస్థాయిలో నోడ్ వ్యవస్థ ..
* పథకం పర్యవేణకు జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలో కమిటీలు వేస్తారు. జాతీయ స్థాయిలో సమీక్ష కమిటీకి క్యాబినెట్ సెక్రటరీ నేతృత్వం వహిస్తారు. జిల్లా, రాష్ట్రస్థాయిలో సమీక్ష కమిటీలు ఏర్పడుతాయి.
* కేంద్రస్థాయిలో ప్రాజెక్టు మానిటర్ యూనిట్ (పీఎంయూ)ను ఏర్పాటుచేస్తారు. దానికి సీఈవో ఉంటారు. ఇది పథకంపై ప్రచారం చేస్తుంది. అవగాహన కల్పిస్తుంది.
* పథకం అమలు పర్యవేక్షణకు ఒకనోడ్ వ్యవస్థను ఏర్పాటుచేస్తారు. ఏదో ఒక ప్రభుత్వశాఖకు ఈ బాధ్యత అప్పగించాలి. వారికి ప్రోత్సాహకాలు ఇస్తారు.
* జిల్లాస్థాయిలో పీఎంకేఎస్‌వై పోర్టల్‌కు లాగిన్ అవకాశం కల్పిస్తారు. రైతులందరికీ వివరాలు అందుబాటులో ఉంటాయి.
* ఏ బ్యాంకు ద్వారా డబ్బును అందజేయాలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *