మెదక్ జిల్లా ములుగు మండలంలో ఉద్యానవన యూనివర్సిటీ, అటవీ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రకటించారు. అటవీ యూనివర్సిటీకి అనుబంధంగా కాలేజీ, పరిశోధన కేంద్రం కూడా ఏర్పాటు అవుతాయని, దాదాపు రెండు వేల కోట్లతో వీటిని నిర్మించనున్నట్లు సీఎం తెలిపారు. శుక్రవారం జగదేవ్ పూర్ మండలంలోని ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుండి హైదరాబాద్ వెళ్తూ మార్గమధ్యంలో ములుగు ఫారెస్ట్ రీసర్చ్ సెంటర్ వద్ద ఆగి అక్కడ ఏర్పాటు చేయబోయే సంస్థలకు సంబంధించిన స్థలాన్ని పరిశీలించారు.
ఈ యూనివర్సిటీలకు ములుగు వద్దనున్న వెయ్యి ఎకరాల భూమిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని మెదక్ జిల్లా ఇన్చార్జి కలెక్టర్ శరత్ ను సీఎం ఆదేశించారు. త్వరలోనే శంకుస్థాపన కార్యక్రమానికి తానే వస్తానని, అందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. 500 ఎకరాల విస్తీర్ణంలో అటవీ యూనివర్సిటీ, కాలేజీ, పరిశోధనా సంస్థల ఏర్పాటుకు ముందుగా 100కోట్ల రూపాయలను కేటాయించినట్లు, మరో 500 ఎకరాల్లో ఏర్పాటు కానున్న హార్టీకల్చర్ యూనివర్సిటీ నిర్మాణానికి 100కోట్లను కేటాయిస్తున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు.