డిసెంబర్ 6 న హోంగార్డు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు హోం గార్డులపై వరాల జల్లు కురిపించారు. శుక్రవారం డీజీపీ అనురాగ్ శర్మ, ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి నాగిరెడ్డి, ఇంటలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి తదితరులతో హోం గార్డుల సమస్యలపై చర్చలు జరిపి వారి వేతనాన్ని రూ. 9 వేల నుండి రూ. 12 వేలకు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. పెంచిన వేతనాలు 2015 సం. ఏప్రిల్ నుండి అమల్లోకి రానున్నాయి. అంతేకాకుండా పరేడ్ అలవెన్స్ ను రూ. 28 నుండి రూ. 100 కు పెంచుతున్నట్లు, ప్రతి ఏడాది రెండు యూనిఫాంలు అందజేయాలని, మెడికల్ ఇన్సూరెన్స్, హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో ఉచిత బస్ పాస్ సౌకర్యం కల్పిస్తున్నట్లు సీఎం ప్రకటించారు.
పోలీసులతో సమానంగా విధులు నిర్వర్తిస్తున్నా హోం గార్డులకు ఇంతకాలం సరైన జీతభత్యాలు, వసతులు లేవు. చాలీచాలని జీతాలతోనే నెట్టుకు వస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో జీతభత్యాలు, అలవెన్సులు పెంచాలని ఎన్నోసార్లు ఆందోళనలకు దిగారు. ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. అయినా వారిని సీమాంధ్ర ప్రభుత్వాలు కనికరించకపోగా లాఠీ దెబ్బలు కొట్టాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హోం గార్డు అసోసియేషన్ నాయకులు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకుపోయారు. సీఎం హోం గార్డుల పరిస్థితిపై ప్రత్యేకంగా సమావేశాలు జరిపి రాష్ట్రంలో ఎంతమంది హోం గార్డులు పని చేస్తున్నారు? వారి జీతభత్యాలు, అలవెన్స్ లు, ఆరోగ్య పరిస్థితి తదితర సమస్యలపై చర్చించారు.
సీఎం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని 16 వేల కుటుంబాల భవిష్యత్తు నిలబడిందని రాష్ట్ర హోం గార్డుల అసోసియేషన్ అధ్యక్షుడు రాజేందర్ హర్షం వ్యక్తం చేశారు. ఉమ్మడిరాష్ట్రంలో పదేళ్లకు పైగా పోరాడినా ఫలితం లేదని, తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆరు నెలల్లోనే తమ కోరికలు నెరవేర్చారని, బతికున్నంత కాలం సీఎం కేసీఆర్ కు హోం గార్డుల కుటుంబాలు రుణపడి ఉంటాయని అన్నారు. హోం గార్డుల సమస్యల పరిష్కారానికి పాటుపడిన అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, హోం మంత్రి నాయిని, డీజీపీ అనురాగ్ శర్మ, హోం గార్డు ఉన్నతాధికారులకు రుణపడి ఉంటామని రాజేందర్ పేర్కొన్నారు.