-ఏపీకి ప్రత్యేకంగా ఏర్పాటు చేయండి
-ఉమ్మడి హైకోర్టుతో ఇబ్బందులొస్తున్నాయి
-భారత ప్రధాన న్యాయమూర్తికి ముఖ్యమంత్రి కేసీఆర్ వినతి
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నాలుగు నెలలు దాటినా హైకోర్టు ఇంకా ఉమ్మడిగానే కొనసాగుతున్నదని, దీనివల్ల పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు భారత న్యాయమూర్తి జస్టిస్ హెచ్‌ఎల్ దత్తు దృష్టికి తెచ్చారు. వీటిని పరిగణనలోకి తీసుకుని సత్వరమే హైకోర్టును రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా ఏర్పాటు చేయాలని కోరారని తెలిసింది.
ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి గురువారం సాయంత్రం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్‌ఎల్ దత్తుతో భేటీ అయ్యారు. సుమారు గంటపాటు సాగిన సమావేశంలో హైకోర్టు విభజన అంశంపై ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు హైకోర్టు ఉమ్మడిగా కొనసాగుతున్నందున వెంటనే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాల్సిందిగా ప్రధాన న్యాయమూర్తిని కేసీఆర్ కోరినట్లు తెలిసింది.
ప్రస్తుతం ఉన్న భవనంలోనే రెండు రాష్ట్రాలకూ విడివిడిగా హైకోర్టులు పనిచేసేలా సత్వరం నిర్ణయం తీసుకోవాలని కేసీఆర్ కోరినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. తెలంగాణ న్యాయవాదులు సైతం హైకోర్టు విభజనకోసం ఆందోళనలు చేస్తున్నారని, వీటిన్నింటినీ దృష్టిలో పెట్టుకుని వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాల్సిందిగా దత్తుకు కేసీఆర్ విజ్ఞప్తి చేసినట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. గతంలో ఢిల్లీ పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీని, కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌ను స్వయంగా కలిసి, ఇదే విషయంలో విజ్ఞాపనలు అందించిన కేసీఆర్.. ఇప్పుడు ప్రధాన న్యాయమూర్తితో భేటీ కావడం గమనార్హం. గతంలో కేంద్ర న్యాయశాఖ మంత్రిని కలిసిన కేసీఆర్.. ఇప్పటికిప్పుడు హైకోర్టును విభజిస్తే కొత్తగా భవనం దొరకడం ఆంధ్రప్రదేశ్‌కు కష్టమవుతుంది కాబట్టి ఉమ్మడి హైకోర్టు కొనసాగుతున్న భవనంలోనే ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సైతం తగిన స్థలాన్ని ఏర్పాటు చేయవచ్చునని చెప్పారు.
కానీ రెండు రాష్ట్రాలకు విడివిడిగా హైకోర్టులు ఉండడం అవసరమని న్యాయశాఖ మంత్రికి కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. ఒకే భవనంలోనే ఈ రెండు కోర్టులు పనిచేయడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కూడా వివరించారు. ఒకే భవనంలో సచివాలయం, శాసనసభలు సజావుగా కొనసాగుతున్న అనుభవం కండ్లముందు ఉన్నదని, వీటి నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు రావటం లేదని చెప్పారు. అదే తీరులో హైకోర్టు కూడా విడివిడిగా ఒకే భవనం నుంచి పని చేయడంలో ఎలాంటి సమస్యలు ఉండబోవని వివరించారు.
దీనిపై సానుకూలంగా స్పందించిన న్యాయమంత్రి రవిశంకర్ ప్రసాద్, ప్రస్తుతం ఈ వ్యవహారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పరిశీలనలో ఉన్నందువల్ల అక్కడి నుంచి నిర్ణయం రాగానే హైకోర్టు విభజన ప్రక్రియ పూర్తవుతుందని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కేసీఆర్ కలువటం ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలో ఇదే విషయమై న్యాయవాదుల జేఏసీ సభ్యులు కూడా రవిశంకర్ ప్రసాద్‌ను కలిసి హైకోర్టు ఉమ్మడిగా కొనసాగుతున్నందువల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతున్నదని, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్నట్లుగా వెంటనే రెండు రాష్ట్రాలకూ వేర్వేరు హైకోర్టును ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
నమస్తే తెలంగాణ సౌజన్యంతో..